. . . మెరిట్ జాబితాలో పేరు ఉండాలంటే రూ.30 వేలు ఇవ్వాలి
. . . వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగి పేరిట దరఖాస్తుదారులకు ఫోన్లు
. . . బాధితులే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నాడీఎంహెచ్ వో
నిజామాబాద్, బతుకమ్మ :
వైద్య ఆరోగ్యశాఖలో స్టాఫ్ నర్సు ఉద్యోగాలు కావాలంటే డబ్బులు డిమాండ్ చేస్తున్నారు కొందరు. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగిని అని 9038108948 అనే నంబర్ తో అశోక్ అనే వ్యక్తి స్టాఫ్ నర్సు ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన వారికి ఫోన్ చేసిన సంఘటన సోమవారం జరిగింది. స్టాఫ్ నర్సు పోస్టులకు దరఖాస్తు చేసుకున్న మీ పేరు షార్ట్ లిస్టులో ఉండాలంటే అర్జెంట్ గా రూ.30 వేలు ఇవ్వాలని సంగీత (పేరు మార్చడం జరిగింది). అనే దరఖాస్తుదారులకి ఫోన్ చేశారు. సోమవారం సాయంత్రం వరకు డబ్బులు ఇవ్వాలని అప్పుడే మెరిట్ జాబితాలో పేరు ఉంటుందని మిగితా డబ్బులు పోస్టింగ్ ఇచ్చిన తర్వాత ఇవ్వాలని నమ్మకంగా చెప్పడం విశేషం. దానితో బాధితులు అప్రమత్తమై అశోక్ అనే వ్యక్తి గురించి వైద్య ఆరోగ్య శాఖలో ఆరా తీశారు. సంబంధిత వ్యక్తి వైద్య ఆరోగ్య శాఖలో పని చేయడం లేదని, ఆ ఫోన్ నంబర్ కూడా వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగిది కాదని తేలింది. అయితే వైద్య ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్సు ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన వారిలో ఆందోళన నెలకొంది. ఉద్యోగాల భర్తీ సంబంధించిన దరఖాస్తుదారుల జాబితా ప్రైవేట్ వ్యక్తుల వద్దకు ఎలా వెళ్లిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్టాఫ్ నర్సు ఉద్యోగాల భర్తీ డబ్బులకు అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం తెలిసిన వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.రాజశ్రీ సంబంధిత ఆరోపణలపై అక్రమార్కులను హెచ్చరించారు. కానీ ఎటువంటి తాము చర్యలు తీసుకోమని బాధితులే డబ్బులు అడిగిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పడం విశేషం. వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీ వ్యవహరంలో డబ్బుల వసూళ్ళపై ఆరోపణలు ఉన్నప్పటికీ శాఖపరమైన విచారణ కానీ, జిల్లా అధికార యంత్రాంగం స్పందించకపోవడం అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ పేరు చెప్పి డబ్బుల వసూళ్ళకు తెగబడ్డ వారిపై పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయడం లేదన్న విమర్శలు వ్యక్తమౌతున్నాయి. స్టాఫ్ నర్సు ఉద్యోగాల భర్తీ వ్యవహరం పై నీలినీడలు కమ్ముకున్నాయి. డీఎంహెచ్ వో మాత్రం డీఎస్సీ ద్వారానే మెరిట్, రోస్టర్ పాయింట్ల ప్రకారమే ఉద్యోగాల భర్తీ జరుగుతుందని అంతా పారదర్శకంగా చేస్తున్నామని చెబుతున్నారు.
