29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

పార్కు స్థలం.. ఫ్లాట్ల మయం

Must read

📰 Generate e-Paper Clip

  • డిటిసిపిలో 32 ప్లాట్లు, నకిలీ లేఔట్ లో 38
  • ఫోర్జరీతో మరో మ్యాప్
  • వెంచర్ వారికి మున్సిపల్ సహకారం
  • ఫిర్యాదు చేసిన స్పందించని అధికారులు

నిజామాబాద్, బతుకమ్మ: పార్క్ కోసం వదిలిన స్థలం ప్లాట్ల మయమయ్యింది. ఈ విషయం తెలియని అభాగ్యులకు ప్లాట్లను విక్రయించేశారు. డిటిసిపి లేఔట్ లో పార్క్ మైదానం నిమిత్తం 1210 గజాల స్థలాన్ని వదిలినట్లు చూపించారు. దీని ఆధారంగా సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ లేఔట్ తయారుచేసి మైదానం కోసం వదిలిన స్థలంలో ప్లాట్లు చేసి విక్రయించారు. ఈ స్థలం కొనేందుకు గ్రామ కార్యదర్శి ముందుకు వచ్చి రూ. 5 లక్షలు ముందస్తుగా చెల్లించారు. అనుమానం వచ్చి విచారించగా అది పార్కు స్థలం అని గ్రహించారు. వెంచర్ ఏర్పాటులో 10 పర్సెంట్ స్థలం పార్కు కోసం వదిలిన దానిని ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్నారని తన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరడంతో యజమానుల బాగోతం బయటపడింది.

డిటిసిపిలో 32 ప్లాట్లు :

ముబారక్ నగర్ లోని ఆర్టీసీ కాలనీ పక్కన మానిక్ బండార్ గ్రామ పరిధిలో గల 660/ఆ సర్వే నెంబర్ లో రెండు ఎకరాల 34 గుంటల స్థలంలో పద్మావతి నగర్ పేరిట వెంచర్ ను ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారం ప్రతి వెంచర్లో 10 పర్సెంట్ స్థలాన్ని మైదానం కోసం వదలాల్సి ఉంటుంది. ఎల్.పి. 8/2003/హెచ్.ఆర్.ఓ.. సి.నంబర్ 581/2003/హెచ్2 ఆధారంగా హైదరాబాద్ లోని డిటిసిపి లేఅవుట్ 32 ప్లాట్లకు అనుమతినిచ్చింది.

నఖిలి లేఅవుట్ లో 38 ప్లాట్లు :

అక్రమంగా సంపాదించాలని పద్మావతినగర్ వెంచర్ యజమానులు తలచారు. డిటిసిపి లేఔట్ 32 ప్లాట్లకు ఇచ్చిన అనుమతి ఉత్తర్వుల సంఖ్య ఆధారంగానే నకిలీ పటాన్ని (మ్యాప్) తయారు చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డారు. వచ్చిన కొనుగోలుదారులను మాయ చేసి వారికి పార్క్ ప్లాట్లను అంటగట్టారు.

పార్కు మరో చోట :

10 పర్సెంట్ స్థలాన్ని ప్లాట్లు చేసి విక్రయిస్తున్న బాగోతం మెల్లగా బయటపడటంతో మున్సిపల్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. డిటిసిపి లో ఉన్న పార్కును గాకుండా మరోచోట ఈ మైదానాన్ని మున్సిపల్ టౌన్ ప్లాన్ అధికారులు ఏర్పాటు చేయడం గమనార్హం. ఈ విషయంలో ఫిర్యాదుదారుని నుంచి తీవ్రమైన ఒత్తిడి పెరగడంతో కొద్దిపాటి స్థలాన్ని గుర్తించి ఫెన్సింగ్ ను తూతూ మంత్రంగా వేశారు. నిబంధనలను అనుసరించి పని చేయాల్సిన మున్సిపల్ అధికారులు, స్థలాలు అన్యక్రాంతమవుతున్న గాని పట్టించుకోకపోవడం చూస్తే దీని వెనుక పెద్ద ఎత్తున చేతులు మారాయనే అనుమానాలు వినిపిస్తున్నాయి.

ఫిర్యాదు చేసిన పట్టింపు లేదు : 

ప్లాట్ లో మారిన స్థలాన్ని పార్కుగా మార్చాలని వేడుకుంటున్న వ్యక్తి జిల్లా కలెక్టర్ తో పాటు మున్సిపల్ కమిషనర్, డిటిసీపీకి, ముఖ్య కార్యదర్శికి పిర్యాదు చేశారు. ఇంతవరకు పద్మావతినగర్ వెంచర్ యజమానులపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలు ఉండడంతో వెంచర్ లోని పార్క్ స్థలాన్ని ప్లాట్లుగా మార్చేసి విక్రయించేశారని ఫిర్యాదుదారుడు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

More articles

Latest article