- తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (టూటా) అధ్యక్షులు డా.ఏ.పున్నయ్య
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల పదవీ విరమణ వయసును 60 నుంచి 65 సంవత్సరాలకు పెంచాలనితెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఏ పున్నయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ వైస్ ఛాన్స్లర్ ఆచార్య టీ.యాదగిరి రావు, రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి ద్వారా ప్రభుత్వానికి విజ్ఞాపన పత్రాన్ని పంపారు. ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ పున్నయ్య మాట్లాడుతూ నేడు తెలంగాణ రాష్ట్రంలోని ఉన్నత విద్యాశాఖ పరిధిలో 12 వర్సిటీలున్నాయని, వాటిలో 2,817 మంది ఆచార్యుల మంజూరు పోస్టులకు గాను కేవలం 757 మంది మాత్రమే పనిచేయడంతో, విశ్వవిద్యాలయాలలో బోధనతోపాటు పరిశోధనలో వెనుకబడినాయన్నారు. నేటి వరకు వివిధ విశ్వవిద్యాలయాల్లో 2,060 ఆచార్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. 75 శాతం ఆచార్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇక ప్రతినెలా ఉస్మానియా, జేఎన్‌టీయూహెచ్, కాకతీయ, తెలంగాణ, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ విశ్వవిద్యాలయాల్లో ఇద్దరు ముగ్గురు చొప్పున పదవీ విరమణ పొందుతున్నారని అన్నారు. ఫలితంగా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో న్యాక్ గ్రేడ్ అర్హత కోల్పోనున్నాయన్నారు. న్యాక్ గ్రేడ్ అర్హత కోల్పోవడంతో విశ్వవిద్యాలయాలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిధులు కూడా అందక విశ్వవిద్యాలయాలన్నీ నిర్వీర్యం అవుతాయన్నారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్య దూరం అవుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం పంపిన కామన్ యూనివర్సిటీ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లును వెనక్కితీసుకొని, ఈ ప్రభుత్వం కొత్త కమిషన్ ఏర్పాటుకు మరింత సమయం పడుతుంది కావున అనివార్యంగా ఆచార్యుల పదవి విరమణ వయసు పెంచనట్లయితే భవిష్యత్తులో విశ్వవిద్యాలయాల్లో అన్ని ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండే పరిస్థితి సమీపిస్తుందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61కి పెంచారు. దాంతో వర్సిటీల్లోని బోధనేతర ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు ఆమేరకు పెరిగిందని తెలిపారు. గత ప్రభుత్వం విశ్వవిద్యాలయాల పట్ల అనుసరించిన వివక్ష కారణంగా విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ఆచార్యులు అరవై ఏళ్లకే ఉద్యోగ విరమణ పొందుతున్నారని, కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఆచార్యుల పదవీ విరమణ వయసుతో సమానంగా రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఆచార్యుల వయసు పెంచాలని డిమాండ్ చేశారు. మరోవైపు వైద్య కళాశాలల్లో ఆచార్యుల వయసును గత ప్రభుత్వమే 65కి పెంచిందని, ఇతర రాష్ట్రాల్లోనూ ఆచార్యుల వయసు 65కు పెంచారని అన్నారు. మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోనూ 65కు చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 60 సంవత్సరాలే ఉండటంతో వర్సిటీలు కునారిల్లుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ తక్షణమే ఆచార్యుల పదవీ విరమణ వయసు 65 సంవత్సరాల వరకు పెంచాలని తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు డాక్టర్ సత్యనారాయణ రెడ్డి, కోశాధికారి డాక్టర్ అడికే నాగరాజ్, డాక్టర్ వాసం చంద్రశేఖర్, ఆచార్య అరుణ, ఆచార్య అపర్ణ, ఆచార్య సిహెచ్ ఆరతి, డాక్టర్ బాలకిషన్, డాక్టర్ కిరణ్మయి, డాక్టర్ ప్రవీణ్ మామిడాల,డాక్టర్ ప్రసన్న శీలా, డాక్టర్ నీలిమ, డాక్టర్ మహేందర్,తదితరులు పాల్గొన్నారు.

