. మాట మార్చడం రైతులను వంచించడమే..
. మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి
నిజామాబాద్, బతుకమ్మ: రాష్ర్ట ప్రభుత్వం దొడ్డు ధాన్యానికి సైతం బోనస్ ఇవ్వాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రకాల ధాన్యా(దొడ్డు, సన్నరకం)నికి రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు కేవలం సన్నరకానికి మాత్రమే బోనస్ ఇస్తామనడం రైతులను వంచించడమేనని విమర్శించారు. ఆర్భాటంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినప్పటికీ క్షేత్రస్థాయిలో ధాన్యం సేకరణ వేగవంతంగా సాగడం లేదని, బోనస్ ఎగ్గొట్టేందుకే ఉద్దేశ్యపూర్వకంగా జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. ఏం చేయాలో తెలియక రైతులు ప్రైవేట్ వ్యాపారులకు, దళారులకు ధాన్యం విక్రయించి నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ రైతు ఏ రకం పంట సాగు చేశాడనే వివరాలు వ్యవసాయశాఖ వద్ద ఉన్నాయని, ఆ లెక్క ప్రకారం రైతులకు ఎకరానికి 25 క్వింటాళ్ల దిగుబడి చొప్పున క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దొడ్డు ధాన్యానికి సైతం బోనస్ ఇవ్వకపోతే ప్రభుత్వం చేస్తున్న మోసంపై రైతులతో కలిసి బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు.
