మహబుబ్ నగర్, బతుకమ్మ :
జోగులాంబ జోన్ – VII డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్ ఆదేశాల మేరకు మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన జోనల్ పోలీస్ డ్యూటీ మీట్ – 2026-27 కార్యక్రమాన్ని సోమవారం జిల్లా ఎస్పీ డి.జానకి ప్రారంభించారు. ఈ జోనల్ డ్యూటీ మీట్‌లో జోన్ – VII పరిధిలోని ఐదు జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా సైంటిఫిక్ ఎయిడ్స్ టు ఇన్వెస్టిగేషన్, యాంటీ సాబొటేజ్ చెక్, కంప్యూటర్ నాలెడ్జ్, డాగ్ స్క్వాడ్, ఫోటోగ్రఫీ & వీడియోగ్రఫీ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించబడుతున్నాయి.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.జానకి మాట్లాడుతూ ముందుగా మీ జిల్లాల తరపున ఈ జోనల్ డ్యూటీ మీట్‌కు ఎంపికై వచ్చిన మీరందరూ అత్యుత్తమ ప్రతిభ కనబర్చి మీ జిల్లాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. అనంతరం జోనల్ స్థాయిలో విజేతలుగా నిలిచి రాష్ట్ర స్థాయిలో జరిగే పోలీస్ డ్యూటీ మీట్‌కు అర్హత సాధించి, అక్కడ కూడా అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించి జోన్ – VII కు ఉన్నత స్థాయి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఇటువంటి పోటీలు పోలీసు సిబ్బందిలో వృత్తి నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, దర్యాప్తు సామర్థ్యాలను మరింత మెరుగుపరచడానికి దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ, ఎన్‌బీ రత్నం, ఏఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, ఆర్‌ఐలు కృష్ణయ్య, నగేష్, అశోక్ కుమార్, భూత్పూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణతో పాటు ఇతర అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
