Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 March 2026, 5:57 pm Posted by : ramakrishna

యువత పరిశోధనల వైపు ఆసక్తి చూపించాలి

 

. . . సఫల ఆర్గానిక్స్ లిమిటెడ్ వ్యవస్థాపకులు, శాస్త్రవేత్త, డా.పైడి ఎల్లారెడ్డి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

రసాయన శాస్త్రం అభ్యసించిన వారు ఉన్నతంగానే ఎదుగుతారని, నేటి యువత పరిశోధనల వైపు ఆసక్తి చూపాలని, తద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని సఫల ఆర్గానిక్స్ లిమిటెడ్ వ్యవస్థాపకులు, శాస్త్రవేత్త, డా.పైడి ఎల్లారెడ్డి అన్నారు. గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల, నిజామాబాద్ రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో, పీఎం ఉషా నిధుల సహకారంతో “నిర్మాణం నుండి పునర్నిర్మాణం వరకు రసాయన శాస్త్రం: నూతన సంశ్లేషణను సమాజ స్థిరత్వంతో అనుసంధానం” అనే అంశంపై ఒక రోజు జాతీయ సదస్సును మంగళవారం విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పి.రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని కోర్సులు, సబ్జెక్టులలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని, అందుకు తగినట్లుగా విద్యార్థులకు లోతైన అవగాహన, పరిశోధనా అనుభవం కలిగించుటకు ఈ విద్యా సంవత్సరంలో 5 జాతీయ సదస్సులు నిర్వహించామని అన్నారు. ప్రముఖ వక్తలుగా హాజరైన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్య దేవలపల్లి రామాచారి, ఐఐసిటి హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ జి.సుధాకర్, తెలంగాణ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ కాశీనాథ్, నాందేడ్ నుండి ప్రొఫెసర్ ఎస్.బి.పట్వారి, డాక్టర్ బి.సాయిలు తమ విలువైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వివిధ రాష్ట్రాల నుండి మొత్తం 61 పరిశోధన పత్రాలు సమర్పించారు. సదస్సు ప్రత్యేక సంచికను అతిథులు ఆవిష్కరించారు. దాదాపు 300 మంది రీసెర్చ్ స్కాలర్లు, విద్యార్థులు పాల్గొని, పేపర్ ప్రెజెంటేషన్, పోస్టర్ ప్రెజెంటేషన్, సైన్స్ ఫేర్ లను నిర్వహించారు. సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ రంగరత్నం, కో-కన్వీనర్ డాక్టర్ రాజేష్, మాట్లాడుతూ ఈ సదస్సు శాస్త్రీయ అవగాహనను పెంపొందించడమే కాకుండా పరిశోధనల పట్ల యువతలో ఆసక్తిని పెంచడంలో ముఖ్యపాత్ర పోషించిందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రమణ, రంజిత్, రాము, హనుమాన్లు, చంద్రకళ, శ్రీవర్ష, పి.ఆర్.ఓ. డాక్టర్. దండు స్వామి, లెఫ్టినెంట్ డాక్టర్ రామస్వామి, ఏ.ఓ. రామ్ కిషన్, సూపరిండెంట్ ఉదయభాస్కర్, ఎన్.సి.సి. విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.