. . . ఇంగ్లీష్ రాకున్నా కొన్ని దేశాలు ప్రపంచాన్ని శాసిస్తున్నాయి
. . . సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
. . . తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, బతుకమ్మ
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో వైట్ కాలర్ ఉద్యోగాలు ప్రమాదంలో పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో యువత ఇకనుంచి తమ దృక్పథాన్ని పూర్తిగా మార్చుకోవలసిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. యువత బ్లూ కాలర్ ఉద్యోగాల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సూచించారు. గురువారం ముఖ్యమంత్రి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ, మారిన ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా యువత వైఖరిలో మార్పు రావాలని చెప్పారు. యువత తమ దృక్పథాన్ని పూర్తిగా మార్చుకోవలసిన అవసరం ఉంది. ఏఐ వల్ల వైట్ కాలర్ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అదే స్కిల్డ్, సెమీ స్కిల్డ్ బ్లూ కాలర్ ఉద్యోగాలకు ప్రపంచంలో విపరీతమైన డిమాండ్ ఉంది. బ్లూ కాలర్ జాబ్స్ ను ఏఐ రిప్లేస్ చేయలేదని చెప్పారు. బ్లూ కాలర్ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్రంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రారంభించాం. ఐటీఐలను అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాన్ని అందించే ఏటీసీలుగా మార్చాం. అన్ని పాలిటెక్నిక్ కాలేజీలను అప్‌గ్రేడ్ చేస్తున్నామని వెల్లడించారు. ఏదైనా చదువుకుంటే ఉద్యోగం రావాలి. లేదా ఉపాధి అవకాశమైనా ఉండాలి. సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకుంటే, జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్ వంటి ఉద్యోగాలకు మంచి డిమాండ్ ఉంది. జీవన ప్రమాణాలు కూడా అమెరికాకన్నా మెరుగ్గా ఉన్నాయి. సాంకేతిక నైపుణ్యం ఉంటే మంచి జీతాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఇంగ్లీషు రాకున్నా కొన్ని దేశాలు ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. అక్కడి ఉద్యోగాలను అందిపుచ్చుకోవాలన్న ఉద్దేశంతోనే జర్మన్, జపనీస్ భాషలు నేర్పించడానికి తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుందని గుర్తుచేశారు. పాతికేండ్ల కిందట ఐటీ, కంప్యూటర్ కోర్సులు చేసి, అమెరికా వెళ్లొచ్చనే భావన ఉండేది. ఇప్పుడు ప్రపంచంలో పెను మార్పులొచ్చాయి. ఏఐ తుఫానులో అమెరికానే కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది” అని మారుతున్న పరిస్థితులను వివరించారు. శరవేగంగా మారుతున్న పరిస్థితులను అంచనా వేసుకుని ప్రపంచ దేశాలకు ప్రత్యామ్యాయంగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. బ్లూ కాలర్ జాబ్స్ అనుకూలతల పట్ల యువత దృక్పథంలో మార్పు రావాలని ముఖ్యమంత్రి హితవు పలికారు.