. . . నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
యువత దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. దేశభక్తి, సేవాభావం, వ్యక్తిత్వ వికాసం వంటి మహత్తర లక్ష్యాలతో సమాజంలో సంఘ్ చేస్తున్న సేవలను అభినందించారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కాలేజ్ మైదానం, దుబ్బ ప్రాంతంలో నిర్వహించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నగర శాఖల సంగమం కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. 1925 విజయదశమి పర్వదినాన స్థాపించబడిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్దోత్సవ వేడుకల సందర్భంగా నగరంలోని అన్ని శాఖలను ఒకే వేదికపై సమీకరించి ఈ సంగమ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఐక్యత, సోదరభావం, శిస్తు, సేవాస్పూర్తి పెంపొందించడంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పాత్ర విశేషమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వక్త కల్లూరి ప్రభు కుమార్ ప్రసంగించి సంఘ్ సిద్ధాంతాలు, శతాబ్ద ప్రయాణం, భవిష్యత్ కార్యాచరణపై వివరణ ఇచ్చారు.

అనంతరం మాట్లాడుతూ ఆదివారం జరిగిన కార్యక్రమంలో 50 బస్తీల శాఖలు పాల్గొన్నాయని, నగరంలో ఆర్ఎస్ఎస్ శాఖ ప్రారంభమై 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా వచ్చే సంవత్సరం జరిగే ఈ కార్యక్రమంలో 75 బస్తీల నుండి శాఖలు పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. నగరంలోని స్వయంసేవకులు, ప్రముఖులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
