Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 January 2026, 5:53 pm Posted by : ramakrishna

యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలి

. . . మత్తు పానీయాలను మానేద్దాం, క్రీడల వైపు వెళ్దాం

 

. . . నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 10 ఎకరాలతో క్రీడల స్టేడియం మంజూరు

 

డిచ్‌పల్లి, బతుకమ్మ

 

యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, ఆటలు శారీరక దృఢత్వానికి, మానసిక ప్రశాంతతకు, విజయం సాధించేందుకు ఎంతో అవసరమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. రేకులపల్లి భూపతి రెడ్డి అన్నారు. డిచ్‌పల్లి మండలంలోని సిఎంసి మెడికల్ కాలేజ్ గ్రౌండ్‌లో ఆర్.పి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రికెట్ ఆటలో గెలుపు-ఓటములు సహజమని, ఓడినవారు లోపాలు తెలుసుకుని మరింత కృషితో ముందుకు సాగాలని సూచించారు. గెలిచిన వారు కూడా మరిన్ని విజయాలు సాధించేలా మెలకువలు అలవర్చుకోవాలని అన్నారు. యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ టీమ్ ఏర్పాటు చేసిందని, యువత క్రీడల వైపు ఆసక్తి పెంచితే జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవచ్చని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన ఒలంపిక్స్ లో తెలంగాణ యువత రాణించాలని స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ స్థాపన చేశారని ఎమ్మెల్యే వివరించారు. చిన్న దేశాలు ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్స్ తెస్తుంటే మన రాష్ట్రం నుంచి కూడా ఒలంపిక్స్ లో ఆటగాళ్లు ఆడాలని సీఎం కోరుకుంటున్నారని తెలిపారు. ఇందుకోసం సీఎం కప్, ఇంటర్ జోన్ టోర్నమెంట్లు, పాఠశాలలు–కాలేజీల్లో గేమ్స్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 10 ఎకరాల స్థలంలో క్రీడా స్టేడియం మంజూరు అయ్యిందని, రానున్న రోజుల్లో రూరల్ యువత రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనేలా అవకాశాలు పెరుగుతాయని అన్నారు. క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన ఆర్.పి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌ను ఎమ్మెల్యే అభినందించారు. గెలిచిన జట్టుకు శుభాకాంక్షలు తెలియజేసి, ఓడిన వారికి కూడా ప్రోత్సాహం తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ రాజేంద్రప్రసాద్, గంగదాస్, పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్, పిసిసి కార్యదర్శి భాస్కర్ రెడ్డి, పోలసాని శ్రీనివాస్ శాంసన్, రామచందర్ గౌడ్, డిచ్‌పల్లి మండల సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షుడు వాసుబాబు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

 

Youth should be interested in sports
Youth should be interested in sports