. మిగిలింది గంటలే..
. అధ్యక్ష పదవికి నువ్వానేనా అంటున్న విపుల్ గౌడ్, నాగేంద్ర
. ప్రధాన కార్యదర్శి పదవి బరిలొ 19 మంది
. వచ్చే నెలలో వెలువడనున్న ఫలితాలు
నిజామాబాద్, బతుకమ్మ: కాంగ్రెస్ పార్టీకి ఆయువుపట్టువైన యూత్ విభాగం ఎన్నికల ప్రక్రియ రసవత్తరంగా సాగుతోంది. శనివారం ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో యూత్ విభాగం కాంగ్రెస్ నాయకులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గత నెల 14న సభ్యత్వ నమోదు ప్రారంభంకాగా, ఓటింగ్ ప్రక్రియ శనివారం సాయంత్రంతో ముగియనుంది. నిజామాబాద్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల పరిధిలోని యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం విపుల్ గౌడ్, నాగేంద్ర నువ్వానేనా అన్న రీతిలో పోటీపడుతున్నారు. అధ్యక్ష పదవికోసం మొత్తం ఆరుగురు బరిలో ఉండగా అందులో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని సిరికొండ నుంచి బరిలోకి దిగిన నరేశ్ ను వయస్సు ఎక్కువు ఉన్నదనే కారణంతో తప్పించారు. చివరకు ఐదుగురు పోటీలో నిలువగా నిజామాబాద్ అర్బన్ నుంచి విద్యార్థి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న విపుల్ గౌడ్, బాల్కొండ నియోజకవర్గం నుంచి యువజన కాంగ్రెస్ లో కీలకంగా ఉన్న నాగేంద్ర మధ్య పోటీ నెలకొంది. ప్రధాన కార్యదర్శి పదవికి 19 మంది బరిలో నిలిచారు.
యూత్ విభాగంలోనూ గ్రూప్ రాజకీయాలు..
కాంగ్రెస్ అంటేనే గ్రూప్ రాజకీయాలకు కేరాఫ్ గా పేర్కొంటారు. ఈ నేపథ్యంలో యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో అది స్పష్టంగా కనపడుతోంది. యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో వివిధ పదవులకు బరిలో నిలిచిన అభ్యర్థుల తరుఫున సీనియర్ నాయకుల జోక్యంతో అది బహిర్గతమైంది. రాబోయే తరంలో యువజన కాంగ్రెస్ క్యాడర్ స్థానిక ఎన్నికలలో క్రియశీలక పాత్రం పోషించే అవకాశం ఉండటంతో కొందరు నాయకులు ఆచితూచీ వ్యవహ రిస్తుండగా, మరికొందరు తెర వెనుక రాజకీయాలు చేస్తున్నారు. వివిధ నియోజకవర్గాల నేతలు, కార్పొరేషన్ పదవులలో ఉన్నవారు, జిల్లా కాంగ్రెస్ లో కీలక పదవుల్లో ఉన్న నాయకులు కుడా ఫలానా వ్యక్తికి తమ మద్దతు అంటూ ప్రచారం చేయడంతో యూత్ కాంగ్రెస్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. కాంగ్రెస్ లో కుమ్ములాటలతో నిజామాబాద్ పెద్ద నేతలు సతమతమవుతూ ఆధిపత్యం కోసం ఆరాట పడుతున్నారు. కానీ వారు కుడా యువజన కాంగ్రెస్ లీడర్ల ఎన్నికల్లో జోక్యం చేసుకుంటుండటంతో గెలుపు ఎవరి వైపు మొగ్గు చూపుతుందో తెలియనిపరిస్థితి ఉంది. కొందరు అగ్రనేతలు మాత్రం ఎన్నికల్లో గెలిచిన , గెలువక పోయిన వారు కాంగ్రెస్ కుటుంబ సభ్యులే అంటు అందరు మనవారే అనే ధోరణిలో యూత్ ఎన్నికలను లైట్ గా తీసుకుంటున్నారు.
ఎత్తులకు పై ఎత్తులు
యువజన కాంగ్రెస్ ఎన్నికలు సభ్యత్వ నమోదు, ఓటింగ్ ప్రక్రియ ఆన్ లైన్ లో జరగుతుండటంతో బరిలో నిలిచిన అభ్యర్ధులు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఇప్పటికే యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో బీజేవైఎం ప్రమేయం బహిర్గతమైంది. దీంతో జాగ్రత్త పడ్డ యూత్ కాంగ్రెస్ నాయకులు సభ్యత్వ నమోదు చేసుకున్న వారికి ఐడీ కార్డుల జారీకి సన్నాహాలు చేస్తున్నారు. యువజన కాంగ్రెస్ ఎన్నికల కోసం బరిలో దిగిన నేతలు గెలుపు కోసం సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. ప్రత్యర్థుల ఎత్తులు తెలుసుకుంటూ వారి ఇలాకాలో సభ్యత్వ నమోదు పెంచడంతోపాటు అక్కడ మెజార్టీ కోసం ప్రయత్నిస్తున్నారు. సీనియర్ లీడర్లను నమ్ముకోకుండా యూత్ సహకారంతోనే దూసుకుపోతున్నారు. మరి కొందరు యూత్ ఎన్నికల బరిలో ఉన్న వారిలోపాలను, గత చరిత్రను త్రవ్వి తీస్తు ప్రచారం చేస్తున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన నరేశ్ వయస్సు ఎక్కువ ఉందని ఫిర్యాదు చేసి పోటి నుంచి తప్పించడంలో సఫలమయ్యారు. ఈ నెల 14 వరకు ఎన్నికలు, సభ్యత్వం ఉండటంతో మొన్నటి వరకు రోజుకు 2వేల నుంచి 3వేల సభ్యత్వం చేయించిన వారు ఇప్పుడు వెనుకబడ్డారు. ప్రస్తుతం రోజుకు 30 నుంచి 40 కూడా కావడం లేదు. శనివారం సాయంత్రం వరకు తమ అనుచరులతో సభ్యత్వ నమోదు, ఓటింగ్ ప్రక్రియ పూర్తి చేయడానికి బరిలో నిలిచిన అభ్యర్థులు డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. సభ్యత్వం, ఓటింగ్ ప్రక్రియ 14న ముగిసినా.. ఫలితాలు మాత్రం అక్టోబర్ మాసంలో వెలువడే అవకాశం ఉంది.