. . . సెల్పీ వీడియోతో విషయం వెలుగులోకి
. . . పోలీసులకు ఫిర్యాదు చేసినా బాధితుడి తండ్రి
నిజామాబాద్, బతుకమ్మ :
ఈ నెల 23న నిజామాబాద్ రైల్వేపట్టాలపై ఆత్మహత్యకు వేదింపులే కారణమని ఆలస్యంగా తెలిసింది. నగరంలోని హమాల్ వాడికి చెందిన డోలి అనిల్ అనే యువకుడు ఈ నెల 23న నిజామాబాద్ నగరంలోని రైల్వే ట్రాక్ పై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్ అయిన అనిల్ గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో ఉంటున్నాడు. ఈ నెల 12న అనిల్ తన మరదలితో నిశ్చితార్థం జరిగింది. అయితే ఓ యువతి అనిల్ కు నిశ్చితార్థం జరిగిన విషయం తెల్సిన తర్వాత అతనితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలను అనిల్ బంధువులతో పాటు కుటుంబ సభ్యులకు వాట్సాప్ లో షేర్ చేసింది. కొంత కాలం క్రితం వరకు అనిల్ సదరు యువతి ప్రేమించుకున్నప్పటికీ మనస్పర్థాలతో విడిపోయారు. అనిల్ కు నిశ్చితార్థం జరిగిన వెంటనే విషయం తెలిసిన యువతి తననే పెళ్లి చేసుకోవాలని గొడవకు దిగింది. బాధితుడు, అతని కుటుంబ సభ్యులు ఈ వ్యవహరంపై స్థానిక మూడవ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ విషయాన్ని చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు. అనిల్ తో పాటు అతని కుటుంబ సభ్యులతో సదరు యువతితో చర్చించి క్షమాపణలు కోరడంతో అనిల్ చేసుకునే వివాహానికి అడ్డురాదని సదరు యువతి అంగీకరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇది జరిగిన రెండు రోజులకే మళ్లీ యువతి ఫ్లేట్ ఫిరాయించి తన బంధువు ద్వారా మళ్లీ బెదిరింపులకు దిగినట్లు తెలిసింది. తనను పెళ్లి చేసుకోకపోతే కేసు పెట్టిస్తానని బెదిరించింది. దానితో మనస్థాపం చెందిన అనిల్ తన ఆత్మహత్యకు యువతి కారణమని ఆమె బంధువు కారణమని సెల్పీ వీడియో తీసుకుని గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం అనిల్ సెల్ ఫోన్ లభ్యం కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుడి తండ్రి లక్ష్మపతి తన కుమారుడు ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని 3వ టౌన్ పోలీస్ స్టేషన్ లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
