భార్య ఆస్పత్రిలో ఉండగా.. చేతిలో డబ్బులు లేకపోవడం మనస్తాపం చెంది..
జుక్కల్ మండలం మహమ్మదాబాద్ గ్రామవాసి
నిజామాబాద్ క్రైమ్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్) ఆవరణలో యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. ఈనెల 6న కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన పొనుగంటి సాయిలు(37) తన భార్య సంగీతను డెలివరీ కోసం జీజీ హెచ్ కు తీసుకువచ్చాడు. అదే రోజు ఆమె ఆస్పత్రిలో డెలివరీ కాగా.. వారికి కుమారుడు జన్మించి మృతి చెందాడు. ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. సంగీతకు పల్స్ రేట్ పడిపోవడంతో ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. భార్య ఆస్పత్రిలో ఉండగా.. చేతిలో డబ్బులు లేకపోవడం, అప్పటికే ఇతరుల వద్ద తీసుకున్న అప్పు ఎలా చెల్లించాలో తెలియక సతమవుతున్నాడు. దీంతో గురువారం అర్ధరాత్రి సాయిలు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆస్పత్రి అధికారుల ఫిర్యాదు మేరకు ఒకటో టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిజామాబాద్ జీజీహెచ్ లో ఇటీవల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది.