- స్టేషన్ లో కెమెరాల కోసమని రూ.40 వేల వసూలు
- డబ్బులిచ్చినా కూడా తహసీల్ధార్ వద్ద బైండోవర్
- డబ్బుల కోసం హోటల్ కెమెరాల ధ్వంసం చేసిన ఎస్సై
నిజామాబాద్, బతుకమ్మ : శాంతిభద్రతల పర్యవేక్షణకు నిజామాబాద్ పోలీసు కమిషనర్ గా రెండు నెలల క్రితం బాధ్యతలు స్వీకరించిన సాయిచైతన్య కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా రాత్రివేళ సంచారాన్ని తగ్గించాలని, అసాంఘిక శక్తులు, సంఘవిద్రోహులు, దొంగలు, సంచరించే సమయాన్ని కట్టడి చేయాలని భావించారు. అందులో భాగంగా నిజామాబాద్ నగరంలో ఆపరేషన్ టప్పా చబూత్ర నిర్వహించారు. అది సరిపోదని రాత్రివేళ వ్యాపార కార్యకలాపాలపై నియంత్రణ విధించారు. రాత్రి 10:30 గంటల తర్వాత దందాల బంద్ కు ఉపక్రమించారు. ఈ విషయంలో రాజకీయంగా ఒత్తిళ్ళు వచ్చినా కూడా వెనుకడుగు వేయలేదు. శాంతిభద్రతల విషయంలో ప్రధానంగా ప్రజలకు అసౌకర్యంగా మారినా రౌడిమూకలు, న్యూసెన్స్ కేసులు, డ్రంక్ డ్రైవ్ కేసులను జల్లెడ పట్టేందుకు రాత్రివేళ ఫుట్ పెట్రోలింగ్ తో పాటు కమ్యూనిటీ పోలీసింగ్ ను అమలు చేస్తున్నారు.
కానీ ఇదే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కొందరు పోలీసులు దందాలకు అనుమతివ్వాలంటే కాసుల బేరానికి తెరలేపారు. ఎక్కడ పోలీసు బాసుకు తెలిస్తే తమ గుట్టురట్టవుతుందని వారిపై బలప్రయోగం చేస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని ఒక హోటల్ యజమానికి స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వో రాత్రి 10 గంటల తర్వాత బంద్ చేయాలని కొన్ని రోజుల క్రితం వార్నింగ్ ఇచ్చాడు. రాత్రివేళనే తన గిరాకీ అని హోటల్ యజమాని ఎస్సైతో కాలబేరానికి వచ్చాడు. పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు పెట్టించాలని పురమాయించాడు. తాను చిన్న హోటల్ యజమాని అని అంతా ఇచ్చుకోలేనని బ్రతిమాలడంతో కనీసం 55 ఇన్చుల టీవీని కొనివ్వాలని డిమాండ్ చేశాడు. చివరకు స్వయంగా పోలీస్ స్టేషన్ లోనే హోటల్ యజమాని నుంచి రూ.40 వేల నగదును ఇచ్చుకున్నాడు. డబ్బులు తీసుకున్న తర్వాత కొన్ని రోజుల పాటు హోటల్ వైపు కన్నెత్తి చూడలేదు. హోటల్ ముందు భాగంలో లైట్లు నిలిపివేసి వెనుక నుంచి హోటల్ ను తెరిచి బిర్యానీ అమ్ముకున్నాడు యజమాని. కానీ అధికారులకు నగరంలో హోటళ్ల దందా గురించి తెలియడంతో యజమానిని తహసీల్ధార్ బైండోవర్ చేశాడు. తాను డబ్బులు ఇచ్చినా వేదింపులు ఏమిటని అడుగలేని పరిస్థితిలో ఎస్సైకి తన దందాకు సహకరించాలని మొరపెట్టుకున్నాడు. ఈసారి ఏకంగా హోటల్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను రాత్రిపూట పెట్రోలింగ్ వేళ ఎస్సై స్వయంగా విరగొట్టాడని బాధితుడు వాపోతున్నాడు.
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయిచైతన్య నిక్కచ్చిగా ఉంటూ శాంతిభద్రతల పర్యవేక్షణకు రాజీపడకుండా పని చేస్తుంటే కొందరు మాత్రం రాత్రిపూట జరిగే దందాలలోనూ కాసుల వేటను మొదలుపెట్టారు. హోటళ్ళు, బెల్టుషాప్ లు ముఖ్యంగా బిర్యానీ హోటళ్ళను టార్గెట్ చేశాడు. మరికొందరు తమ ఏరియాలో లిక్కర్ అమ్మే వారు వారానికే మామూళ్ళు ఇవ్వాలని బేరాలతో దందాలను కొనసాగిస్తున్నారు. రాత్రిపూట పెట్రోలింగ్ చేసేది తామే కాబట్టి బ్యాక్ డోర్ లో దందాలు చేసుకోవాలని బేరసారాలను సాగిస్తుండడం పోలీసు శాఖకు మచ్చతెచ్చేలా ఉంది. ఈ విషయంపై పోలీసు కమిషనర్ నిఘా వర్గాల ద్వారా వివరాలు తెలుసుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని పోలీసు శాఖపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టాలని కోరుతున్నారు.