. . . గల్ప్ కు నిలిచిన ఎగుమతులు
. . . పసుపు ధర ఢమాల్
. . . కొనుగోళ్ళ భయంతో మార్కెట్ కు పచ్చి పసుపు
. . . సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు
నిజామాబాద్, బతుకమ్మ :
దేశంలో మేలిమైన పసుపు పంట ఉత్పత్తిలో ఉత్తర తెలంగాణదే అగ్రస్థానం. పొరుగున ఉన్న మహారాష్ట్రలోని సాంగ్లీ తర్వాత తమిళనాడులో పసుపు అధిక సంఖ్యలో పసుపు పండుతున్న ఇందూర్ నుంచి జరిగే కొనుగోళ్లే సింహాభాగం ఆక్రమిస్తాయి. ప్రతీ సీజన్ లో దాదాపు 5 లక్షల క్వింటాళ్ళ నుంచి పైచిలుకు ఒక్క నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ నుంచి కొనుగోళ్ళు జరుగుతాయంటే అతిశయోక్తి కాదు. నిజామాబాద్ తో పాటు పొరుగున ఉన్న నిర్మల్, జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లాల రైతులు పసుపును నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ ద్వారానే విక్రయాలు చేస్తుంటారు. పసుపు పంట పండిస్తే బంగారం పండించినట్లేనని రైతులు భావిస్తారు. గతంలో నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లో పసుపు ధర అత్యధికంగా క్వింటాల్ కు రూ.25 వేల పైచిలుకు పలికిన ఉదాంతాలున్నాయి. దళారుల బెడద నుంచి రక్షించేందుకు వ్యాపారులు సిండికేట్ కాకుండా ఉండేందుకు ఈనామ్ వ్యవస్థను పకడ్బందీగా అమలు చేస్తుంటే ఇటీవల ఇరాన్ – ఇజ్రాయిల్, అమెరికా యుద్దం పసుపు పంట కొనుగోళ్ళ పై విపరీతమైన ప్రభావం చూపుతుంది. మూడు వారాలుగా యుద్దం ప్రారంభమైందో లేదో నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి. దాదాపు 60 శాతం పైచిలుకు పసుపు గల్ప్ దేశాలకే ఎగమతి అవుతుంది. దానిని ఆసరాగా తీసుకుని పసుపు ధర గణనీయంగా పడిపోయింది. క్వింటాల్ కు రూ.1500 నుంచి రూ.3 వేల తక్కువ ధర పలుకుతుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు.

ఇటీవల పసుపు క్రయవిక్రయాలు ప్రారంభమయ్యాయో లేదో ఈనామ్ వ్యవస్థ మొరాయించింది. పాత పద్దతిలో కొనుగోలు చేయాలని సాఫ్ట్ వేర్ అప్ డేట్ జరుగుతుందని మార్కెట్ అధికారులు ప్రకటించారు. తర్వాత ఈనామ్ 1.5 లో అమ్మకాలు షురూ చేశారు. ప్రస్తుతం నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లో మోడల్ పసుపు ధర క్వింటాల్ కు రూ.13 వేలుగా నిర్ణయించారు. శుక్రవారం నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లో రూ.20 వేల క్వింటాళ్ళ పసుపు ప్రతీరోజు అమ్మకం కోసం వచ్చింది. మంచి పసుపునకు క్వింటాల్ కు గరిష్ట ధర రూ.14 వేలుగా పలికింది. ఈ సీజన్ లో నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కు 3 లక్షల క్వింటాళ్ళ పసుపు వచ్చింది. ఫిబ్రవరి నుంచి మార్చి 13 వరకు 2.50 లక్షల క్వింటాళ్ళ పసుపు వచ్చినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. ఈ సీజన్ లో దాదాపు 5 లక్షల పసుపు మార్కెట్ కు వస్తుందని అంచనా వేశారు. మార్చి మాసంలో మార్కెట్ కు లక్ష క్వింటాళ్ళ పసుపు వస్తుందని అధికారులు అంచనా వేశారు. అయితే గత రెండు వారాలకు పైగా జరుగుతున్న యుద్దం ఎఫెక్ట్ పసుపు మార్కెట్ పై పడింది. ధర ఏకంగా రూ.3 వేల వరకు పడిపోవడంతో కొనుగోళ్ళు మందకోడిగా సాగుతున్నాయి. కొనుగోళ్ళు చేసిన ట్రేడర్లు పసుపు ఎగుమతి జరుగక గోదాములు నిండాయని చెబుతున్నారు. గోదాములు నుంచి సరుకు ఎగుమతి జరిగితే ధర పెరుగుతుందని చెబుతుండగా వ్యాపారులు సిండికేట్ గా మారి ధరను తగ్గించారని ఆరోపణలున్నాయి. ఎందుకంటే వ్యాపారులు ఎప్పటికప్పుడు సరుకును కొనుగోలు చేసి మంచి ధర వచ్చినప్పుడే ఈనామ్ లో విక్రయిస్తారని అందరికి తెలిసిన విషయమే. యుద్ద భయాన్ని సొమ్ము చేసుకునేందుకు గాను పసుపు విక్రయాలను, ఎగుమతులను సాకుగా చూపుతున్నారని ఆరోపణలున్నాయి. అదే సమయంలో పసుపు రైతులు కూడా యుద్దభయంతో ఎండిన పసుపు తేమ కలిగిన సరుకును మార్కెట్ కు తరలించకుండా పచ్చిగా ఉన్న పసుపును తరలిస్తున్నారనే ఆరోపణలు కూడా లేకపోలేదు.

నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కంటే అత్యధిక ధర సాంగ్లీ మార్కెట్ లో దొరుకుతుందని చాలాసార్లు ఇక్కడి పెద్దరైతులు నేరుగా అక్కడికి తరలించి అమ్ముకునే వ్యవహరం ప్రతీయేటా జరుగుతుంది. అంతేగాకుండా మోతబరి రైతులు తమ పసుపును ఎండబెట్టి తేమ వచ్చిన తర్వాత నిలువ చేసుకుని మే, జూన్ మాసంలో విక్రయించి అధిక లాభాలు గడిస్తారని పేరుంది. దాదాపు పసుపు క్రయవిక్రయాల సీజన్ ఫిబ్రవరిలో ప్రారంభించి ఏప్రిల్ లో దాదాపు ముగిస్తారు. అయితే పసుపును కొనుగోళ్లు చేసిన బడా ట్రేడర్లు, పేరు మోసిన రైతులు కోల్డ్ స్టోరేజిలో పసుపును నిల్వ ఉంచుకుని మే, జూన్ మాసాల్లో విక్రయించడం ద్వారా క్వింటాల్ కు రూ.25 వేల వరకు పొందుతారనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈసారి గల్ఫ్ లో వచ్చిన యుద్దం కారణంగా ఎగుమతులు లేవన్న సాకుతో కొనుగోళ్ళను మందగింపజేసి ధరను తగ్గించారనే వాదనలున్నాయి. అంతేగాకుండా రైతులకు యుద్ద భయాన్ని చూపి తక్కువ ధరకే సరుకులను కొనుగోలు చేసి నిలువ ఉంచుకుంటున్నారన్న వాదనలున్నాయి. ఇప్పటి వరకు కేవలం సగం కొనుగోళ్ళే జరిగాయని మిగితా కొనుగోళ్ళను రైతుల్లో భయాన్ని వ్యాపారులు సొమ్ము చేసుకునే ప్రయత్నం జరుగుతుందని చెప్పాలి. పసుపు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను తక్కువ ధరకు కొనుగోలు చేసి లాభాలు గడించేందుకే గల్ఫ్ ఎక్స్ పోర్టును వ్యాపారులు తెరపైకి తెచ్చారని చెబుతున్నారు. కేవలం బంగ్లాదేశ్ కు మాత్రమే ఎగుమతి జరుగుతుందని గల్ఫ్ దేశాలకు నిలిచిపోయిందని చెబుతుండడం విశేషం. గల్ఫ్ దేశాల నుంచి వచ్చే పెట్రోలియం ఉత్పత్తులకు లేని ఢోకా కేవలం పసుపు ధర తగ్గుదల ఎగుమతులపై ఏ విధంగా ప్రభావం చూపుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రైతులను వ్యాపారులు నిండా ముంచుతున్నా అటు అధికారులు కానీ పాలకులు కానీ వారిలో భరోసా నింపడం లేదని విమర్శలు వస్తున్నాయి.
