Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 December 2024, 11:30 pm Posted by : ramakrishna

యాసంగి మొదలాయే –యాంత్రికరణ రాకపాయే  

  • మంత్రి మాటలు ఉత్తిదేనా 
  • పథకంతో  చిన్నకారు రైతులకు ప్రయోజనం

నిజామాబాద్, బతుకమ్మ : సాగు పనుల్లో విపరీతంగా ఖర్చులు  పెరుగుతున్నాయి. కూలీలకు, యంత్రాలకు ఇచ్చే కిరాయిలు రాబడి కన్నా ఎక్కువవుతోంది. గత పదేళ్ళుగా వ్యవసాయ శాఖ పరంగా ఇస్తున్న పథకాలను నిలిపివేశారు. ఇప్పటి ప్రభుత్వం రైతులకు ఉపయోగపడే విధంగా యాంత్రికరణను ప్రవేశపెట్టాలని తలచింది. దీనిలో భాగంగానే ఇటీవల సంబంధిత మంత్రి యాసంగి మొదట్లోనే సాగుకు అవసరమయ్యే పరికరాలను అందిస్తామని వెల్లడించారు.  దుక్కులు మొదలైన పథకం మాట ఎక్కడ వినపడడం లేదు.

యాంత్రికరణపై ఆశలు 

రైతులకు ప్రధానంగా అవసరమయ్యే పనిముట్లు, పరికరాలు, యంత్రాల వివరాలు జిల్లాల వారిగా జాబితాను తెప్పించుకున్న తర్వాత, వ్యవసాయ ప్రదర్శనను ఏర్పాటుచేస్తామన్నారు. దీనినంత నిశితంగా పరిశీలిస్తున్న రైతులలో యంత్రికరణపై ఆశలు చిగురించాయి.  సాగు కోసం నానాటికి వ్యయ భారం పెరుగుతోంది. దీనికితోడు  కూలీల కొరత ఉండడంతో వ్యవసాయం చేసేందుకు రైతులు వెనుకంజ వేస్తున్నారు. చిన్నపాటి యంత్రాలు ఉన్నట్లయితే సాగు ఖర్చు కాస్త తగ్గనుంది.  రైతులకు సాగుకు అవసరమయ్యే పరికరాలను రాయితీపై అందజేస్తామని గత నెల మొదట్లో మంత్రి తెలిపారు.  యాసంగిలో దుక్కులకు  ట్రాక్టర్లు, పవర్ వీడర్లు వస్తాయని  రైతాంగం  ఆశించింది.   దుక్కులు మొదలైన వాటి ఊసే లేదు.

చిన్నకారు రైతులకు ప్రయోజనం 

పంట సాగుకు ఉపయుక్తమయ్యే పరికరాలను అందించినట్లయితే సన్నకారు రైతుకు ప్రయోజనం చేకూరనుంది. ట్రాక్టర్లు, పవర్ వీడర్లు, పంటలపై పిచికారీ  చేసేందుకు పంపులతో పాటు పలు రకాలైన పరికరాలను రాయితీపై అందిస్తామని సంబంధిత మంత్రి ప్రకటించారు. ఇవే గనుక రైతు చెంతకు వెళ్తే తన భూమిలో సాగు చేసుకోవడమే గాకుండా ఇతరులకు కిరాయికి ఇచ్చి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అవకాశం ఉంటుంది. తనకున్న కొద్దిపాటి నేలలో కుటుంబం సాగుచేసుకునే విధంగా యంత్ర పరికరాలు ఉంటే వ్యయ ప్రయాసలు రైతుకు తగ్గనున్నాయి.

రైతు పండుగలోనైనా.. 

సాగు చేసినా, చేయకపోయిన పంటపై  రెండు లక్షల రూపాయల రుణం తీసుకున్నరైతులకు   కాంగ్రెస్ ప్రభుత్వం  రుణమాఫిని  చేసింది. దీనిలో భాగంగానే కాంగ్రెస్ ఏడాది పాలనలో పంట రుణ మాఫీ చేసామని  సంబరాలు జరుపుతోంది. ఈ వేడుకల్లోనైన అన్నదాతలకు అవసరమయ్యే యంత్రాలను రాయితీపై అందజేస్తే రైతులు సంబరాలు నిర్వహించుకుంటారనే వ్యాక్యాలు గ్రామాలలో వినబడుతున్నాయి.