రుద్రూర్, బతుకమ్మ :
రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంతృప్తికర స్థాయిలో సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలుచేసి అన్ని వర్గాల ప్రజల మనసు దోచుకున్నారని అన్నారు. ఆయన చేసిన సేవలు, సంక్షేమ పథకాలు ఇప్పటికీ ప్రజల కళ్ల ముందు మెదలుతూనే ఉన్నాయని, జల యజ్ఞంతో రైతుల పాలిట అపర భగీరథుడయ్యారన్నారు. ఆరోగ్య శ్రీ తో పేదల గుండెల్లో ఊపిరై నిలిచారని పేర్కొన్నారు. అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించిన సిసలైన నాయకుడని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్, గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్, ఉప సర్పంచ్ నిస్సార్, మాజీ జడ్పిటిసి నారోజి గంగారం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, నాయకులు కర్క అశోక్, పత్తి రాము, వడ్ల నరేష్, కిసాన్ కేత్ అధ్యక్షులు అడప సాయిలు, ఇమ్రాన్, గాండ్ల శ్రీను, రజక్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.