Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 April 2025, 3:13 pm Posted by : ramakrishna

పూజలు.. బిల్లులు.. లంచాలు

. ఏసీబీకి పట్టుబడిన శ్రీనివాస్ శర్మ నిర్వాకం

. విధులకు హాజరుకాకున్నా ప్రధాన సెక్షన్ ల బాధ్యతలు

. శర్మకు సహకరించిన అధికారులపై చర్యలకు డిమాండ్

జిల్లాపరిషత్, బతుకమ్మ: పూజలు.. బిల్లులు.. లంచాలు.. ఒకదానితో ఒకదానికి సంబంధం లేకున్నా మూడింటినీ చక్కగా సమన్వయం చేసుకుంటూ టైమ్ బాగున్నప్పుడే మూడురాళ్లు వెనకేసుకోవాలనుకున్నాడు పంచాయతీరాజ్ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ శర్మ. అందుకోసం ముఖ్య ప్రజాప్రతినిధులను, శాఖ ఉన్నతాధికారులను, బడా కాంట్రాక్టర్లను మచ్చిక చేసుకుని ముందుకుసాగుతూ చివరకు ఏసీబీ వలకు చిక్కాడు.

పంచాయతీరాజ్ డివిజన్ కార్యాలయంలో డిప్యుటేషన్ పై సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తించిన శ్రీనివాస్ శర్మ ఏనాడూ కార్యాలయం ముఖం చూసిన దాఖలాలు లేవని ఆ శాఖ ఉద్యోగులు అంటున్నారు. శుభకార్యాలు, ప్రత్యేక పూజలంటూ బయట వ్యాపకాలపై మక్కువ చూసే శ్రీనివాస్ శర్మకు డివిజన్ స్థాయి అధికారి అండదండులున్నాయని, కార్యాలయం ముఖం చూడని అతడికి ప్రధాన సెక్షన్ ల బాధ్యతలు అప్పగించారని అంటున్నారు.

మచ్చిక చేసుకోవడంలో దిట్ట

తను అనుకున్న పని పూర్తి చేసుకునేందుకు అధికారులను, ప్రజా ప్రతినిధులను మచ్చిక చేసుకోవడంలో శ్రీనివాస్ శర్మ ఆరితేరినట్లు ఆయన ఉద్యోగ ప్రస్థానం రుజువు చేస్తోంది. బాన్సువాడ డివిజన్ లో జూనియర్ అసిస్టెంట్ గా ఉన్నప్పుడే అవినీతి ఉద్యోగులకు వెన్నుదన్ను ఉండే అధికారి ద్వారా  చైర్మన్ సహకారం తీసుకుని తాను అనుకున్న విధంగా బాన్సువాడ నుంచి ఆర్మూర్ డివిజన్ కు డిప్యుటేషన్ పై వచ్చాడు. పదోన్నతి వస్తుందని గ్రహించి ఫారిన్ సర్వీసు కావడంతో ఐదేళ్ల గడువు సమీపంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో చేరాడు. వారం లోపల సీనియర్ అసిస్టెంట్ గా పదోన్నతి పొంది బాల్కొండ సబ్ డివిజన్ లో పోస్టింగ్ తీసుకొని ఆర్మూర్ డివిజన్ కు డిప్యుటేషన్ తెచ్చుకున్నాడు. వీటన్నింటిని పరిశీలిస్తే శ్రీనివాస్ శర్మకు శాఖాపరంగా అండదండలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

శంకుస్థాపనలకు పూజారి.. బిల్లుల మంజూరుకు అధికారి..

ఆశన్నగారి జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ప్రభుత్వ కార్యక్రమాల శంఖుస్థాపనలకు శ్రీనివాస్ శర్మ పూజారిగా వ్యవహరించే వాడు. కార్యాలయానికి వెళ్లకుండా పూజలకు వెళ్తున్నాడని శాఖ ఉద్యోగుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమైనప్పటికీ ఎమ్మెల్యే అండదండలున్నాయంటూ తన పని తాను కానిచ్చాడు. ఇదే అదనుగా బయటి పూజలకూ వెళ్లేవాడు. కార్యాలయం వైపు కన్నెత్తి చూడకపోయినా విధులకు హాజరైనట్లుగా పూర్తి జీతం తీసుకునేందుకు శ్రీనివాస్ శర్మకు డివిజన్ స్థాయి అధికారి సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి.

ఆయనకే ప్రధాన సెక్షన్లు..

కార్యాలయానికి రాడని తెలిసినా ప్రదానమైన సెక్షన్ ల బాధ్యతలను శ్రీనివాస్ శర్మకు అప్పగించడంలో మర్మమేమిటో ఉన్నతాధికారులకే తెలియాలని ఉద్యోగులు, సిబ్బంది చర్చించుకుంటున్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే ఎస్డీఎఫ్, సీడీపీ, సీఆర్ఆర్, ఎంఆర్ఆర్, పీఎంజీఎస్వై సెక్షన్ల బాధ్యలను శ్రీనివాస్ శర్మ చూశారు. పని పూర్తి చేసి బిల్లుల కోసం తిరిగే గుత్తేదారులు ఆయన కోసం ప్రతి రోజూ వేచిచూడడం మామూలు విషయంగా మారింది. పర్సెంటేజీ లు ఇచ్చిన గుత్తేదారులకు ఇవ్వాల్సిన బిల్లులను ఇచ్చేవాడని సహా ఉద్యోగులు మాట్లాడుకుంటున్నారు. ఏసీబీకి పట్టుబడ్డ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ శర్మ అలియాస్ నగేశ్ అవినీతికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ జెడ్పీ ఉద్యోగుల నుంచి వస్తోంది.