- అదనపు కలెక్టర్ భోజనం చేసినా పురుగుల అన్నమే
- తనిఖీలో పురుగులను చూసి అవాక్కైన అధికారులు
ఎల్లారెడ్డి, బతుకమ్మ : అన్నంలో పురుగులు వస్తున్నాయని ఎల్లారెడ్డి గిరిజన బాలికల గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు సోమవారం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఏకంగా జాతీయ రహదారిపై ఆందోళన చేయడంతో జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పరిశీలనకు అదనపు కలెక్టర్ విక్టర్ను అదేశించారు. కామారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ విక్టర్ గిరిజన బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. వంట గదిని, స్టోర్ రూంను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో కలసి మద్యహ్న భోజనం చేశారు. ఆయన తినే భోజనంలోనే పురుగులు రావడంతో అధికారులు అవాక్కయ్యారు. విద్యార్థులకు హస్టల్ లలో సన్నబియ్యం, నాన్ వెజ్ మెనూ అమలు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉంటున్నాయి. బియ్యంను ప్రభుత్వం సరఫరా చేస్తుండగా ఎప్పటికప్పుడు కొత్త స్టాక్ ఇస్తుండగా పురుగులు ఎలా వచ్చాయనే సంశయం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థినీలు పురుగులు వస్తున్నాయని రోడ్డెక్కగా, అదనపు కలెక్టర్ తో పాటు అధికారులు మధ్యాహ్నం భోజనం చేస్తే అందులో పురుగులు రావడంతో అధికారుల పర్యవేక్షణ ఎలా ఉందో అనే విషయం తేట తెల్లమైంది. పురుగుల అన్నంను విద్యార్థులకు వండి వార్చుతున్న గిరిజన బాలికల గురుకుల పాఠశాల అధికారులు, సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు సోమవారం ఎల్లారెడ్డి బాన్సువాడ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ… గిరిజన పాఠశాలలో చదువుతున్న తాము అన్నం తినేటప్పుడు తరచుగా పురుగులు వస్తున్నాయని ఈ విషయంపై పలుమార్లు ప్రిన్సిపల్, అధ్యాపకుల దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ వారు ఏమాత్రం పట్టించుకోవడంలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తప్పని పరిస్థితిలో వచ్చి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నామని వారు తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో ఎల్లారెడ్డి – బాన్సువాడ ప్రధాన రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి.