Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 7:10 pm Posted by : ramakrishna

ఘనంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

నాగేంద్రనగర్ గ్రామంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. మాతృత్వానికి గౌరవం, శిశువుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ నిర్వహించిన ఈ వేడుకల్లో శ్రీమంతం, అన్నప్రాశన కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు సంప్రదాయబద్ధంగా శ్రీమంతం నిర్వహించి ఆశీర్వదించగా, చిన్నారులకు అన్నప్రాశన కార్యక్రమాన్ని ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. అనంతరం తల్లిపాల ప్రాముఖ్యతపై తల్లులు, గర్భిణీలకు అవగాహన కల్పించారు. పుట్టిన గంటలోపే శిశువుకు తల్లిపాలు అందించడం, తొలి ఆరు నెలలు పూర్తిగా తల్లిపాలే ఇవ్వడం, ఆ తర్వాత కూడా పోషకాహారంతో పాటు రెండేళ్ల వరకు తల్లిపాలు కొనసాగించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. తల్లిపాలు శిశువుల శారీరక, మానసిక ఎదుగుదలకు ఎంతో కీలకమని సూచించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సందె రంజిత్ మాట్లాడుతూ, తల్లిపాలు ప్రతి శిశువుకు భగవంతుడు ప్రసాదించిన అమూల్యమైన వరమని అన్నారు. ఆరోగ్యవంతమైన తల్లి, ఆరోగ్యవంతమైన బిడ్డే అభివృద్ధి చెందిన గ్రామానికి బలమైన పునాది అని పేర్కొన్నారు. ప్రతి తల్లి తల్లిపాల ప్రాముఖ్యతను గుర్తించి తన బిడ్డకు అందించాలని, తద్వారా ఆరోగ్యకరమైన భావితరాలను నిర్మించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జాకిర్, అంగన్వాడీ టీచర్ అరుణ, ఆశా వర్కర్ సరస్వతి, గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రియాంక, అంగన్వాడీ సిబ్బంది, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, మహిళలు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.