Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 March 2026, 7:08 pm Posted by : ramakrishna

వర్సిటీ న్యాయ కళాశాలలో భూభారతిపై కార్యశాల

 

డిచ్ పల్లి, బతుకమ్మ :

 

తెలంగాణ యూనివర్సిటీ డిచ్‌పల్లి లోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా (యూసిఎల్) ఆధ్వర్యంలో “ల్యాండ్ గవర్నెన్స్ ఇన్ తెలంగాణ స్టేట్ : భూ భారతి యాక్ట్, 2025” అనే అంశంపై వర్క్‌ షాప్ బుధవారం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా సెమినార్ హాల్‌లో విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వర్క్‌ షాప్‌కు ముఖ్య వక్తగా హాజరైన అడ్వకేట్ ఎం. సునీల్ కుమార్ (భూమి సునీల్) భూ చట్టాలు, భూమి రికార్డుల నిర్వహణ, రైతుల హక్కులు, కొత్తగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం–2025 గురించి విస్తృతంగా వివరించారు. ఆయన మాట్లాడుతూ భూమికి సంబంధించిన పత్రాలు, రికార్డులు సక్రమంగా ఉండటం చాలా అవసరమని, రైతులు, ప్రజలు తమ భూములపై ఉన్న హక్కులను తెలుసుకోవడం ద్వారా అనేక సమస్యలను నివారించవచ్చని తెలిపారు.

 

Workshop on Bhubharathi at the University Law College

 

భూమి రికార్డుల డిజిటలైజేషన్, భూ వివాదాల పరిష్కారం, భూమి రిజిస్ట్రేషన్ విధానంలో పారదర్శకత పెంపు వంటి అంశాల్లో భూ భారతి చట్టం ముఖ్య పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. రైతులు భూమి పత్రాలను సరిచూసుకోవడం, చట్టపరమైన అవగాహన కలిగి ఉండడం ద్వారా మోసాలను నివారించవచ్చని కూడా సూచించారు. ఈ సందర్భంగా మరో వక్త అడ్వకేట్ జి.గంగాధర్, తెలంగాణ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కమిషన్ సభ్యుడు, భూ సంబంధిత సమస్యలు, రైతుల సంక్షేమం, భూ పరిపాలనలో పారదర్శకత అవసరంపై ప్రసంగించారు. భూమికి సంబంధించిన వివాదాలు తగ్గించేందుకు ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించడం చాలా అవసరమని అన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ టి. యాదగిరి రావు చీఫ్ పేట్రన్‌గా, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి పేట్రన్‌గా, డీన్ ప్రొఫెసర్ ఎం. శ్రీనివాస్ కో-పేట్రన్‌గా సహకారం అందించారు. కార్యక్రమాన్ని డాక్టర్ కె. ప్రసన్నరాణి, హెడ్ & ప్రిన్సిపాల్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా కన్వీనర్‌గా నిర్వహించారు. డాక్టర్ బి. శ్రావంతి, డాక్టర్ జెట్ట్లింగ్ యెల్లోసా కో-కన్వీనర్లుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ ఎం. నాగజ్యోతి ఆధ్వర్యంలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా విద్యార్థులు, సిబ్బంది సమన్వయం చేశారు. వర్క్‌ షాప్‌లో పాల్గొన్న విద్యార్థులు భూ చట్టాలపై విలువైన అవగాహన పొందారని నిర్వాహకులు తెలిపారు.