. . . మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్, బతుకమ్మ :
బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్ పట్టణంలో నిర్మాణంలో ఉన్న 100 పడకల ఏరియా ఆసుపత్రి పనులను వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, పెండింగ్‌లో ఉన్న ఆసుపత్రి బిల్లులను విడుదల చేయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన నిజామాబాద్ జిల్లా ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య రంగానికి సంబంధించిన పలు అంశాలపై సమగ్రంగా చర్చ నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా ప్రభుత్వ వైద్య సంస్థల పనితీరు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, మందుల లభ్యత, వైద్యులు మరియు సిబ్బంది కొరత, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలను ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మంత్రి దామోదర రాజనర్సింహకు అందజేసి, వాటికి పరిపాలనా అనుమతులు మంజూరు చేయడంతో పాటు నిధులు విడుదల చేయాలని కోరారు. అలాగే భీంగల్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను రాహత్ నగర్ గ్రామానికి తరలించేందుకు అనుమతులు ఇవ్వాలని, రాహత్ నగర్‌లో నూతన పీహెచ్ సీ భవన నిర్మాణానికి పరిపాలనా అనుమతి మంజూరు చేయాలని కోరారు. భీంగల్‌లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు కూడా అనుమతులు ఇవ్వాలని ప్రతిపాదించారు. మోర్తాడ్ మండలంలోని పాలెం లేదా తిమ్మాపూర్ గ్రామంలో కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని, బాల్కొండ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు నూతన భవన నిర్మాణానికి అనుమతి మంజూరు చేయాలని కోరారు. బాల్కొండ, మోర్తాడ్ ప్రాంతాల్లో కొత్త పోస్టుమార్టం భవనాల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు ఇవ్వాలని, నియోజకవర్గంలోని 24×7 పీహెచ్ సీ లు, సీహెచ్ సీలకు అవసరమైన క్యాడర్ స్ట్రెంత్ మంజూరు చేసి ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇక నియోజకవర్గంలోని 9 ఉపకేంద్ర భవనాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) నిధులను విడుదల చేయాలని, 18 ఆరోగ్య ఉపకేంద్రాలు/ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల (ఏఏఎం) నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేసి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్)లో ఎంఆర్ఐ యంత్రం మంజూరు చేయాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, అత్యవసర అవసరాల కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని కూడా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ ప్రతిపాదనలను త్వరితగతిన పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆయన ఆరోగ్య శాఖ మంత్రిని కోరారు.
