ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే మా అజెండా
రైతులకు వివాదాలు లేని భూములు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం
సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలు మహిళ లని, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. మేం బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నారు. 10 ఏళ్లపాటు నిర్లక్ష్యానికి గురైన వ్యవస్థలను చక్కదిద్దుతున్నామన్నారు. మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించామన్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించామన్నారు. క్యూర్ కోడ్ ఇచ్చి మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయించే పథకాన్ని తీసుకొస్తామన్నారు. రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 వేలు ఇస్తున్నామన్నారు. ఆడబిడ్డలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తున్నామన్నారు. రాష్ట్రంలో సన్నధాన్యం దిగుబడి పెరిగి దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. . రాష్ట్ర వ్యాప్తంగా 8 వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు దళారుల బారిన పడకుండా చేశామన్నారు. ధరణి కొందరికి చుట్టమైతే భూభారతి ప్రజలకు రక్షణ చట్టమన్నారు. రైతులకు వివాదాలు లేని భూములు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఉద్యోగ నియమాకాల్లో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందన్నారు.