. . . వడ్లు ఊడుస్తుండగా రైస్ మిల్ బెల్టులో చీర చిక్కుకొని ప్రమాదం
. . . నుజ్జు నుజ్జయిన కాళ్లు, ఒళ్లంతా తీవ్ర గాయాలు
. . . చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న మహిళ
కోటగిరి, బతుకమ్మ :
రైస్ మిల్లులో వడ్లు ఊడుస్తుండగా రైస్ మిల్ బెల్టులో మహిళ చీర తట్టుకుని మహిళకు తీవ్ర గాయాలైన కాళ్లు,చేతులు విరిగిన ఘటన కోటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని పోతంగల్ మండల కేంద్రంలో గల కిసాన్ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కొత్తపల్లి గ్రామానికి చెందిన రేణి మొగులమ్మ(40) పోతంగల్ గ్రామంలోని కిసాన్ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో కూలి పని చేస్తుంది. ఆదివారం ఆమె రైస్ మిల్లులో నడుస్తున్న మిషనరీ పక్కనే ఊడుస్తుండగా ప్రమాదవశాత్తు ఆమె చీర రైస్ మిల్ మిషన్ బెల్ట్ కు చుట్టుకొని ఆమె బెల్ట్ మీద పడి మిషన్ లోకి దూసుకెళ్లింది దీంతో ఆమె రెండు కాళ్లు, కుడి చేయి విరిగి నుజ్జయ్యింది, మొహానికి శరీరానికి తీవ్ర గాయలయ్యాయి. మిషన్లో చిక్కుకుని తీవ్ర గాయాలైన మహిళ అరుపులు విన్న రైస్ మిల్ సిబ్బంది మిషన్ ఆపేసి చూడగా మహిళలకు తీవ్ర గాయాలు అయి తీవ్ర రక్తస్రావం జరగటాన్ని గమనించి రైస్ మిల్ యజమానికి సమాచారం అందించారు. అతి కష్టం మీద ఆమె శరీరాన్ని బయటకు తీసిన సిబ్బంది అంబులెన్స్ కాల్ చేసి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన మహిళను ఆసుపత్రికి తరలించడంలో కాస్త ఆలస్యం అయినట్లు తెలుస్తుంది. ఆమెను నిజామాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో రైస్ మిల్ యాజమాన్యం చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. రైస్ మిల్ మిషన్ లో చిక్కుకున్న మహిళకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. రైస్ మిల్లర్ నిర్లక్ష్యం తో ఓ పేదింటి మహిళ కుటుంబానికి కోలుకోలేని దెబ్బ తగిలిందని. రైస్ మిల్ మిషన్ నడుస్తున్నప్పుడు అశ్రద్ధగా వ్యవహరించి మిషన్ బెల్ట్ పక్కనే ఊడిపించి మహిళా కూలి ప్రాణాలతో రైస్ మిల్ యాజమాన్యం చెలగాటం ఆడిందని స్థానికులు వాపోతున్నారు. ఆ మహిళా కూలి కుటుంబం ఆమె చేసే కూలీ పని పైనే ఆధారపడి బతుకుతుందని ఆమె త్వరగా కోలుకోవాలని స్థానికులు కోరుతున్నారు. లేదంటే ఆ కుటుంబం రోడ్డున పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన విషయంపై బాధితురాలి భర్త సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సునీల్ తెలిపారు.
