Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 October 2025, 3:18 pm Posted by : ramakrishna

మహిళ మృతికి కారణమైన మహిళకు పదేళ్ల  జైలు 

నిజామాబాద్,బతుకమ్మ :  మహిళ మృతికి కారణమైన  మరో  మహిళలకు పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ. 10,000  జరిమానా విధిస్తూ మహిళపై అత్యాచారాల నేర విచారణ న్యాయస్థానం నిజామాబాద్ స్పెషల్ జడ్జి హరీష గురువారం తీర్పు వెలువరించారు. మరో ఇద్దరిపై మహిళపై అత్యాచార నేర నిరూపణ కానందున నిర్దోషులుగా విడుదల చేస్తున్నట్లు తీర్పులో పేర్కొన్నారు. వివరాలు ఇలా..  నిజామాబాద్ జిల్లా వర్ని మండలం బెల్య నాయక్ తండాకు చెందిన  హలవత్ కమల కు కల్లు తాగే అలవాటు ఉంది.ఆర్థిక అవసరాల కోసం ఆమె మగవారితో స్నేహం చేసేది. 11 సెప్టెంబర్, 2019 న ఆమె తన బంధువు అయిన సేవాలాల్ తండా కు చెందిన మహిళను వెంటబెట్టుకుని తన తల్లిగారి గ్రామం అయిన అక్బర్ నగర్ కు తీసుకెళ్లింది. అక్కడ తనకు పరిచయస్తులైన అక్బర్ నగర్ నివాసులు నడిపెంటి ప్రవీణ్, తుర్ర రాజేష్ కుమార్ లను పిలుపించుకుని గ్రామ శివారులోని ఒక పాతబడిన స్కూల్ దగ్గర నలుగురు మద్యం సేవించారు. మహిళలతో సమయం గడిపినందున ప్రవీణ్ ఒక మహిళకు రూ.400 ఇచ్చాడు. ఈడబ్బులు తనకే కావాలని కమల  గొడవ చేసింది.ఆ మహిళను కమల  చేతులతో పిడి గుద్దులు ముఖంపై గుద్ది  వెనుక నుంచి తోయడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందింది.మృతి చెందిన మహిళ విషయంలో  రుద్రూర్  పోలీస్ అధికారులు ప్రాథమిక విచారణ చేపట్టారు.  వైద్యులు మృతురాలికి నిర్వహించిన పోస్ట్ మార్టమ్ నివేదిక, డీఎన్ఎ, ఫారెన్సిక్ నివేదికలుతో కూడిన  అభియోగ పత్రాన్ని కోర్టులో సమర్పించారు. ప్రధాన ముద్దాయిగా ప్రవీణ్, రెండవ ముద్దాయిగా రాజేష్ లను చేర్చారు. వారిపై భారత శిక్షస్కృతి సెక్షన్ 376(2)(కె )లో పేర్కొన్న విదంగా వారిద్దరిపై ఆధిపత్యం ఉన్న వ్యక్తులు చేసే మహిళపై అత్యాచారం నేరారోపణలు, మూడవ ముద్దాయిగా కమలపై మహిళ మృతికి కారణానమైనట్లు నమోదు చేశారు. ప్రాసిక్యూషన్, ముద్దాయిల తరపున న్యాయవాదుల వాదనలు పూర్తయ్యాయి. ప్రవీణ్, రాజేష్ లపై మహిళపై అత్యాచార నేర ఆరోపణలు రుజువు కానందున కోర్టు వారిపై కేసును కొట్టివేస్తు నిర్దోషులుగా విడుదల చేసింది. కమలపై భారత శిక్షస్కృతి సెక్షన్ 304 పార్ట్ 2 మహిళ మృతికి కారణమైనందున పది సంవత్సరాల కఠిన జైలుశిక్ష, పది వేల రూపాయల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని యెడల అదనంగా ఆరు నెలల సాధారణ జైలుశిక్ష అనుభవించాలని పేర్కొన్నారు.పోలీసుల తరపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బంటు వసంత్ ప్రాసిక్యూషన్ నిర్వహించారు.