నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ లో కరెంట్ హీటర్ షాక్ తగిలి మహిళ మృతి చెందింది. ఈ సంఘటన గురువారం ఉదయం జరిగింది. నిర్మల్ జిల్లా లోస్రం మండలం పుస్పూర్ తాండకు చెందిన వీణాబాయి రాథోడ్ దంపతులు 5 సంవత్సరాలుగా నిజామాబాద్ లో ఉంటూ కూలీ పనులు చేసుకుని జీవిస్తున్నారు. గురువారం ఉదయం వీణాబాయి ప్లాస్టిక్ బకెట్ లో హీటర్ ను పెట్టి నీళ్ళు వేడి చేసింది. అయితే నీళ్ళు వేడి అయిన తర్వాత కరెంట్ స్వీచ్ ఆఫ్ చేయకుండానే హీటర్ ముట్టుకోవడంతో కరెంట్ షాక్ తగిలి గాయపడింది. ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు 4వ టౌన్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.
