Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 June 2026, 7:08 pm Posted by : ramakrishna

పూల నిమజ్జనానికి వెళ్లి చెరువులో పడి మహిళ మృతి

 

​నందిపేట, బతుకమ్మ :

 

పూజా పూలను నిమజ్జనం చేసేందుకు వెళ్లిన ఓ మహిళ ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన ఘటన నందిపేట మండల కేంద్రంలోని రాంనగర్‌లో బుధవారం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి నందిపేట ఎస్సై వినయ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ​రాంనగర్‌కు చెందిన పీ. సుజాత (50) బుధవారం ఉదయం ఇంట్లో పూజా కార్యక్రమం ముగించుకుని, పూలను రఘునాథ చెరువులో నిమజ్జనం చేసేందుకు వెళ్లారు. అదే సమయంలో ఆమె భర్త గంగాధర్ పని నిమిత్తం బయటకు వెళ్లారు. మధ్యాహ్నం గంగాధర్ ఇంటికి తిరిగి రాగా, సుజాత కనిపించలేదు. ఆందోళన చెందిన ఆయన ఆరా తీయగా, స్థానికుల ద్వారా చెరువులో ఒక మహిళ మృతదేహం ఉన్నట్లు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకుని చూడగా, మృతదేహం తన భార్య సుజాతదేనని గుర్తించారు. ​సుజాతకు బీపీ, షుగర్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, పూల నిమజ్జనం కోసం వెళ్లిన క్రమంలో కాలు జారి నీటిలో పడి మృతి చెంది ఉండవచ్చని ఆమె భర్త గంగాధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భార్య మృతిపై ఎటువంటి అనుమానాలు లేవని ఆయన పేర్కొన్నారు. మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై వినయ్ తెలిపారు.