Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 September 2026, 8:14 pm Posted by : ramakrishna

రోడ్డు ప్రమాదంలో మహిళ ఘోర దుర్మరణం

 

. . . లారీ చక్రాల కింద నలిగి బడా భీమ్‌గల్ వాసి మృతి

​ఇందల్వాయి,  బతుకమ్మ  :

 

44వ జాతీయ రహదారిపై  శనివారం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే దుర్మరణం చెందినట్లు స్థానికులు తెలిపారు. దంపతులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బడా భీమ్‌గల్ గ్రామానికి చెందిన దుమాల లింబాద్రి, ఆయన భార్య దుమాల సుజాత(35)తో కలిసి కామారెడ్డిలో వ్యక్తిగత పనులు ముగించుకుని తమ మోటార్ సైకిల్‌పై స్వగ్రామానికి తిరుగుపయనమయ్యారు. మార్గమధ్యలో ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రయాన్ పల్లి గ్రామ శివారులో వెనుక వైపు నుంచి అతివేగంగా వచ్చిన ఒక లారీ ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టింది.​ఈ ప్రమాదంలో బైక్ తీవ్రంగా అదుపుతప్పి కిందపడిపోగా సుజాత లారీ వెనుక చక్రాల కింద పడిపోయింది. లారీ చక్రాలు ఆమెపై నుంచి వెళ్లడంతో తీవ్ర రక్తస్రావమై సంఘటన స్థలంలోనే ప్రాణాలు వదిలింది. బైక్ నడుపుతున్న భర్త లింబాద్రి స్వల్ప గాయాలతో బయటపడినప్పటికీ కళ్లముందే భార్య మృతిచెందడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

. . . ​రోడ్డుపై భారీగా నిలిచిన ట్రాఫిక్

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. దట్టమైన రద్దీ ఉన్న ప్రాంతం కావడంతో కాసేపు ట్రాఫిక్ తీవ్రంగా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న ఇందల్వాయి ఎస్‌ఐ సుమలత తమ సిబ్బందితో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మృతదేహాన్ని పంచనామా నిర్వహించిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్‌లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి  మార్చురీకి తరలించారు. మృతురాలి భర్త దుమాల లింబాద్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇందల్వాయి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సుమలత తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ వాహనంతో సహా  అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు పోలీసులు వెల్లడించారు. రోడ్డుపై వెళ్లే వాహనదారులు వేగ పరిమితి పాటిస్తూ జాగ్రత్తగా వెళ్లాలని ఈ సందర్భంగా పోలీసులు విజ్ఞప్తి చేశారు.