Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 6:17 pm Posted by : ramakrishna

నాగారం శివారులో మహిళ దారుణ హత్య

 

లింగంపేట, బతుకమ్మ : 

 

కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం నాగారం గ్రామ శివారులో ఓ మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. మండలంలోని నాగారం గ్రామానికి చెందిన చింతకుంట అనసూయ (35) అనే మహిళకు కొర్పోల్ గ్రామానికి చెందిన గుట్టమీద సాయిలు అనే వ్యక్తి ఇనుపరాడ్ తో కొట్టి దారుణంగా హత్య చేసినట్లు మృతురాలి తల్లి పోలీసులుకు ఫిర్యాదు చేయగా ఆదివారం ఉదయం ఎల్లారెడ్డి సిఐ రాజారెడ్డి, లింగంపేట ఎస్సై దీపక్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. హత్య జరిగిన ప్రదేశంలో నిందితుడు చంపడానికి ఉపయోగించిన ఇనుపరాడ్డును స్వాధీనం చేసుకున్నారు. ఫింగర్ ప్రింట్ సిబ్బందిని పిలిపించి వేలిముద్రలను సేకరించారు. మృతురాలికి తల్లి చంద్రవ్వ, తిరుపతి అనే పదేళ్ల కుమారుడు ఉన్నట్లు గ్రామస్తులు చెప్పారు. నాగారం గ్రామానికి చెందిన చింతకుంట అనసూయకు అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో పెళ్లి చేశారు. కొన్నేళ్ల తర్వాత భర్త అనసూయను వదిలిపెట్టి వెళ్లిపోయాడు. కాగా అనసూయ కొర్పోల్ గ్రామానికి చెందిన గుట్టమీద సాయిలు అనే వ్యక్తితో గత దశాబ్ద కాలంగా సహజీవనం చేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. మృతురాలు అనసూయ తన తల్లి చంద్రవ్వ, తిరుపతితో కలిసి జీవనోపాధి కోసం హైదరాబాదులో ఉంటున్నారు. ఇంటి వద్ద సాగు చేస్తున్న పంట పొలాలను చూసేందుకు వారానికోసారి వచ్చి చూసి వెళ్లేదని గ్రామస్తులు తెలిపారు.మృతురాలి తల్లి చంద్రవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

Woman brutally murdered on the outskirts of Nagaram
Woman brutally murdered on the outskirts of Nagaram