- వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్
నిజామాబాద్, బతుకమ్మ : ఇవాళ్టితో ధరణి అనే దరిద్రం పోయిందని వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ అన్నారు. రైతులు ధరణి పోర్టల్ తో చాలా ఇబ్బంది పడ్డారని అన్నారు. భూములు వున్నా పాస్ బుక్ లు రాక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగారని తెలిపారు. కొందరైతే రైతులు గుండె ఆగి చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దళారులకు ధరణి వరంగా మారిందని పేర్కొన్నారు. గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను తీసేసి కేసీఆర్ సర్కార్ దళారులకు అప్పగించిందని మండిపడ్డారు. ధరణి వచ్చినప్పటి నుండి రైతులు నిద్రలేని రాత్రులు గడిపారని అన్నారు. ఏండ్ల తరబడి సాగుచేసుకుంటున్న రైతులు కూడా ధరణి వచ్చాకా కౌలు రైతులయ్యారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి ని బంగాళా ఖాతంలో వేస్తామని చెప్పామని, చెప్పిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి స్థానంలో భూ భారతి తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఏడాది కాలంగా రైతులతో, మేధావులతో, రెవెన్యూ అధికారులతో చర్చించి భూ భారతిని సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చారని తెలిపారు. అసెంబ్లీ కొత్త ఆర్ వో ఆర్ చట్టం ప్రవేశ పెట్టినందుకు సంతోషంగా వుందని అన్నారు. రైతులు మనసారా ఇవాళ పండుగ చేసుకుంటున్నారని తెలిపారు. యావత్ తెలంగాణ రైతాంగం హర్షిస్తుందన్నారు. అన్నదాత ఆనందంగా ఉంటేనే రాష్ట్రం ఆనందంగా ఉంటుందని తెలిపారు. రైతులు సంతోషంగా ఉండేలా చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి, వ్యవసాయ మంత్రి తుమ్మలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.