సాధారణ రోజుల కంటే రెట్టింపు ధరలకు మార్కెట్లో పూల విక్రయం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బతుకమ్మ, దేవీ శరన్నవరాత్రులు, దసరా పండగల వేళ పూల మార్కెట్లో వాటి ధరలకు రెక్కలోచ్చాయి. పూల వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి పూల రేట్లను అమాంతం పెంచేశారు. దీంతో మహిళలు ఎంతో ఘనంగా నిర్వహించే బతుకమ్మ పండుగ లో మార్కెట్లో పూల ధరలను చూసి షాక్కు గురవుతున్నారు. ఈ మూడు పండగలకు పువ్వులతో దగ్గరికి సంబంధం ఉన్న నేపథ్యంలో ఎలాగైనా ప్రజలు పూలను కొనుగోలు చేస్తారని ఉద్దేశంతో వ్యాపారులు సిండికేట్ గా మారి కావాలని ధరలను పెంచేశారు. వారు ఏ రేట్ చెప్తే ఆ రేటు పెట్టి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఏమైనా అడిగితే మహారాష్ట్ర నుంచి పూలను అధిక ధరలకు కొనుగోలు చేసి తీసుకు వస్తున్నామని పూల వ్యాపారులు మోసానికి పాల్పడడం ప్రతి పండగల పూట వారికి పరిపాటిగా మారింది. అవే ధరలు, అవే పూలు సాధారణ రోజుల్లో మామూలు ధరలో ఉండే పువ్వులు పండగలు రాగానే రెట్టింపు ధరలకు పెంచేస్తూ ప్రజల నుండి అధికంగా ధరలతో వసూళ్లకు పాల్పడుతున్నారు.

అయితే వీరిని నియంత్రించాల్సిన ప్రత్యేక అధికారిక వ్యవస్థ జిల్లాలు లేకపోవడం మూలంగానే ఈ విధంగా వారి ఇస్టారీతిన పండగలు రాగానే వారికి నచ్చిన విధంగా ధరలను పెంచేసి పబ్బం గడుపుకుంటున్నారు నిజామాబాద్ పూల మార్కెట్ వ్యాపారులు. ఇప్పటికైనా పూల మార్కెట్ కు ఓ ప్రత్యేక అధికారిక వ్యవస్థను ఏర్పాటు చేస్తే పూల ధరలపై నియంత్రణ ఉండి, పండగ వేళ సామాన్యులకు అందుబాటులో పూల ధరలు ఉండే విధంగా జిల్లా అధికారిక యంత్రాంగం దృష్టి పెడితే మంచిదని ప్రజలు అంటున్నారు.
