. . . కాంగ్రెస్ ఇంచార్జి వినయ్ కుమార్ రెడ్డి బెదిరింపులకు భయపడను
. . . మున్సిపల్ ఆఫీస్ లో సీసీ కెమెరాలు పెట్టే అధికారం నీకు ఎవరిచ్చారు
. . . పీవీఆర్ వసూళ్ల దందా పై ప్రజలు తిరగబడాలి
. . . అధికారులూ..పీవీ ఆర్ మాటలు విని జైళ్ల పాలు కాకండి
. . . బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వార్నింగ్
ఆర్మూర్, బతుకమ్మ :
సీఎం రేవంత్ రెడ్డి కే తాను భయపడ లేదు.. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి (పీవీఆర్)బెదిరింపులకు తాను భయపడనని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జీ వినయ్ రెడ్డి అవినీతి అక్రమాల పై మాట్లాడితే నా అంతు చూస్తా అంటావా, ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్ లో ఉన్నా..దమ్ముంటే రా జీవన్ రెడ్డి బుధవారం సవాల్ విసిరారు. మున్సిపల్ కార్యాలయంలో వినయ్ రెడ్డి పెట్టించిన సీసీ కెమెరాలను పరిశీలించిన అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ..

పి అంటే పైసా, వీ అంటే వసూలు , ఆర్ అంటే రెడ్డి అని ఆయన ఎద్దేవా చేశారు. ఇది పీవీఆర్ క్రైమ్ నెం-2 అని , మున్సిపల్ ఆఫీస్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మరీపీవీఆర్ సరికొత్త అవినీతికి తెరలేపారని పలువురు తన జనతా గ్యారేజ్ లో ఫిర్యాదు చేశారన్నారు. దీంతో తాను బుధవారం ఆర్మూర్ మున్సిపల్ ఆఫీస్ కి వచ్చి పరిశీలిస్తే పీవీఆర్ ఏర్పాటు చేసిన వాయిస్ రికార్డింగ్ సీసీ కెమెరాలు కనిపించాయని జీవన్ రెడ్డి మండిపడ్డారు.నమస్తే ఆర్మూర్-జనతా గ్యారేజ్ కార్యక్రమంలో భాగంగా పీవీ ఆర్ క్రైమ్ నెం-2 గా అవినీతి బాగోతం చూపించడానికి ఆర్మూర్ పట్టణంలో మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా పర్యటించిన తనతో అనేక మంది బాధితులు మాట్లాడి వినయ్ కుమార్ రెడ్డి ధనదాహం గురించి కథలు కథలుగా చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు. తనను ఉద్దేశించి వినయ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జీవన్ రెడ్డి భగ్గుమన్నారు.

సమాచార హక్కు చట్టం ప్రకారం తెప్పించిన అన్ని ఆధారాలతో తాను పీవీఆర్ పై నిర్దిష్టమైన ఆరోపణలు చేశానని, వాటికి పీవీఆర్ సూటిగా జవాబు చెప్పకుండా నా పై వ్యక్తిగత విమర్శలు చేయడం సిగ్గు చేటు అని ఆయన నిప్పులు చెరిగారు. మున్సిపల్ ఆఫీస్ లో సీసీ కెమెరాలు పెట్టే అధికారం నీకెవరిచ్చారు.ఏ అర్హత ఉందని ప్రభుత్వ కార్యకలాపాల్లో జోక్యం చేసుకుంటున్నావు, ప్రజా ప్రతినిధి వి కాదు కదా కనీసం ప్రభుత్వ చప్రాసి కూడా కాదు అని విమర్శించారు అన్ని వర్గాల వారిని బెదిరించి డబ్బులు వసూలు చేసే అధికారం నీకెవరిచ్చారు, ఆర్మూర్ నీ అయ్య జాగీరా, ఇక నీ ఆటలు సాగవు జాగ్రత్త అని హెచ్చరించారు. నీ సీఎంకే భయపడను.. నువ్వెంత? నన్ను అనే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకో. పీవీఆర్ వసూళ్ల దందా పై ప్రజలు తిరగ బడాలి అని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. అధికారులూ..పీవీ ఆర్ మాటలు విని జైళ్ల పాలు కాకండి అని ఆయన హితవు పలికారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి మున్సిపల్ ఆఫీస్ లో పీవీఆర్ తన అవినీతి దందా కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను తొలగించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వినయ్ కుమార్ రెడ్డి తో కుమ్మక్కయి ప్రజాధనం దోపిడీకి కారణమవుతున్న పలువురు అధికారుల పేర్లు తన జనతా గ్యారేజ్ లోని పింక్ బుక్ లో ఎక్కిస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం రాగానే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జీవన్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పూజ నరేందర్,మాజీ కౌన్సిలర్ చక్రు సీనియర్ నాయకులు పోల సుధాకర్,రాజేశ్వర్ రెడ్డి,సుంకరి రవి,శ్యామ్,పృథ్వి, శ్రావణ్,మహేష్,అజీమ్,మాలిక్ బాబా,అర్షద్,లతీఫ్,సైఫ్ తదితరులు పాల్గొన్నారు.