- – క్రిందికి వంగిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్
- – ప్రమాదకరంగా విద్యుత్ తీగలు
- – రైతుల పాలిట శాపంగా మారిన విద్యుత్ శాఖ అధికారులు
- – సబ్ చార్జీలు కట్టినా కూడా మాకు సంబంధం లేదు అంటున్న రుద్రూర్ మండల విద్యుత్ శాఖ అధికారులు
- – రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న వర్ని, రుద్రూర్ మండల విద్యుత్ అధికారులు
రుద్రూర్, బతుకమ్మ : వినియోగదారులు, రైతులకు ఎలాంటి సమస్యలు వచ్చినా.. విద్యుత్ సంబంధిత అధికారులు, సిబ్బంది వెంటనే స్పందించాలి. నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించాలి. ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం వద్దు.. ఇవి తరచూ సమావేశాల్లో విద్యుత్ ఉన్నతాధికారులు చెప్పే మాటలు. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటోంది. ఉన్నతాధికారుల ఆదేశాలను, మాటలను క్షేత్రస్థాయిలో పనిచేసే విద్యుత్ ఏఈఈలు, ఉద్యోగులు, సిబ్బంది పెడచెవిన పెడుతున్నారు. ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా?.. అని రైతులు వాపోతున్నారు. వినియోగదారుల సమస్యలను పరిష్కరించడంలో విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. రుద్రూర్ మండలంలోని అంబం(ఆర్) గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో విద్యుత్ స్తంభానికి ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ నేలకు ఆనుకునేలా క్రిందికి వంగిందని, దీని వలన విద్యుత్ తీగలు చేతికందేలా కిందికి వేలాడుతున్నాయని రైతు ఆరోపించాడు. దీని వలన ప్రమాదం జరిగే అవకాశం ఉందని, ఈ సమస్య గురించి విద్యుత్ శాఖ అధికారులకు విన్నవించిన కూడా పట్టించుకోకుండా విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. 2021 నుండి 2023 వరకు ట్రాన్స్ ఫార్మర్ క్రింద ఉన్న బోరుకు సబ్ చార్జీలు ప్రతి సవంత్సరం 400 రూపాయలు కట్టానని, ఇప్పుడు క్రిందికి వంగిన ట్రాన్స్ ఫార్మర్ సరిచేయాలని, ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, గత ఎనిమిది నెలల నుండి విద్యుత్ సబ్ స్టేషన్ చుట్టూ తిరిగినా కూడా విద్యుత్ శాఖ అధికారులు మాకు ఎలాంటి సంబంధం లేదని ఇది వర్ని మండలం తగిలేపల్లి శివారులోకి వస్తుందని, ఈ సమస్యను వర్ని విద్యుత్ శాఖ అధికారులకు తెలుపాలని రుద్రూర్ మండల విద్యుత్ శాఖ అధికారులు అంటున్నారని ఆ రేతు తెలిపాడు. ఈ సమస్యను పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు విన్నవించిన పట్టించుకోకుండా నిమ్మకు నీరు నీరేత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఉన్నత శాఖ అధికారులు వెంటనే స్పందించి ప్రమాదపు అంచులో ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ను సరిచేయాలని కోరారు.
