- కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
సిరికొండ, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూ భారతి’ (ఆర్.ఓ.ఆర్) చట్టంతో రైతులకు విస్తృత ప్రయోజనాలు కలుగుతాయని, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ, ఇందల్వాయి మండల కేంద్రాలలోని రైతు వేదికలలో భూభారతి నూతన చట్టంపై రైతులకు శుక్రవారం అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సులలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. భూభారతి చట్టంపై, అందులో పొందుపర్చిన అంశాల గురించి కలెక్టర్ రైతులకు అవగాహన కల్పించారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా రైతులకు సంబంధించిన భూములపై వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం ఆనేక కొత్త అంశాలను పొందుపరుస్తూ ఈ నూతన ఆర్.ఓ.ఆర్ చట్టాన్ని తెచ్చిందని వివరించారు. భూమి హక్కుల భద్రత, భూ సమస్యల సత్వర పరిష్కారం, రైతుల మేలు కోసం చారిత్రక మార్పు దిశగా ఈ నూతన ఆర్ఓఆర్ చట్టం ఉపకరిస్తుందని, రైతుల భూములకు భరోసా కల్పిస్తుందని సూచించారు. భూ సమస్యలు కలిగిన రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. పైలెట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని నాలుగు మండలాలలో దీనిని ఈ నెలాఖరు వరకు ప్రయోగాత్మకంగా అమలు చేస్తారని, క్షేత్రస్థాయిలో ప్రభుత్వం దృష్టికి వచ్చే ఇతర ఏవైనా అంశాలు, సమస్యలను కూడా పరిశీలించి ఈ చట్టంలో చేర్చడం జరుగుతుందని తెలిపారు. అనంతరం మే మొదటి వారంలో ప్రతి జిల్లాలో ఒక మండలంలో ప్రయోగాత్మక అమలు జరిపిన మీదట అన్ని రెవెన్యూ గ్రామాలలో సదస్సులు నిర్వహిస్తారని అన్నారు. అధికారులు గ్రామాలకు వచ్చి రైతుల నుంచి భూ సమస్యలపై అర్జీలు స్వీకరించి పరిష్కరించడం జరుగుతుందని సూచించారు. నిర్ణీత కాల వ్యవధిలోపు వాటిని పరిష్కరిస్తారని అన్నారు. తమకు న్యాయం జరగలేదని భావిస్తే రైతులు ఆర్డీఓకు, అనంతరం కలెక్టర్ కు అప్పీల్ చేసుకోవచ్చని, ల్యాండ్ ట్రిబ్యునల్ ను కూడా అప్పీలు చేసుకోవచ్చని తెలిపారు. భూ వివాదాల విషయంలో అప్పీలు చేసుకున్న పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం సమకూరుస్తారని సూచించారు. ఈ చట్టం ప్రవేశపెట్టిన ఏడాది కాలం లోపు భూ సంబంధిత సమస్యలపై అర్జీలు పెట్టుకునే అవకాశం కల్పించారని వివరించారు. ఆన్లైన్లో ధరణి పోర్టల్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. భూ సమస్యల పరిష్కారానికి రెండంచెల వ్యవస్థ ఉంటుందని, ఈ. చట్టం ద్వారా రైతులకు వారి భూముల వివరాలతో కూడిన భూధార్ కార్డులను కేటాయిస్తారని తెలిపారు. భూ సమస్యలు తెలుసుకుని సులభతరంగా పరిష్కరించేందుకు భూభారతి చట్టం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. వ్యవసాయ భూములతో పాటు వ్యవసాయేతర, మిగితా అన్ని రకాల భూముల రికార్డులు రెవెన్యూ కార్యాలయంలో నమోదు అయి ఉంటాయని అన్నారు. ఇదివరకటి ధరణిలో రికార్డుల నిర్వహణ లేదని, ఇప్పుడు రికార్డుల నిర్వహణ ఉంటుందని, గతంలో ఏదైనా సమస్య పరిష్కారం కాకుంటే అప్పిల్ వ్యవస్థ లేదని సివిల్ కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆర్డీఓ, కలెక్టర్, సీసీఎల్ఏ స్థాయిలలో అప్పీల్ వ్యవస్థ ఉందని, ప్రతి అంశం భూభారతి పోర్టల్ లో ఉంటుందని, ఎవరైనా వారి భూములకు సంబంధించిన వివరాలను పరిశీలించుకోవచ్చని తెలిపారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న భూభారతి చట్టంలోని నిబంధనల ప్రకారం రికార్డులను అప్డేట్ చేయడం జరుగుతుందన్నారు. కాగా, సాదాబైనామా దరఖాస్తుల క్రమబద్ధీకరణకు సంబంధించి కూడా త్వరలోనే ప్రభుత్వం సమగ్ర మార్గదర్శకాలను జారీ చేయనుందని తెలిపారు. ఈ సందర్భంగా భూభారతి చట్టంలోని కీలక అంశాలైన భూ రికార్డులలో తప్పుల సవరణ, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, వారసత్వంగా వచ్చిన భూములకు మ్యుటేషన్, ఇతర మార్గాల ద్వారా వచ్చిన భూమికి మ్యుటేషన్, సాదా బైనామాల క్రమబద్దీకరణ, పట్టాదారు పాసు పుస్తకాలు, అప్పీల్ వ్యవస్థ, రివిజన్ అధికారాలు, గ్రామ రెవెన్యూ రికార్డులు, రికార్డుల నకలు పొందడం ఎలా అనే అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ధరణి పోర్టల్ లో లేని అనేక సమస్యలకు భూభారతి చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందని అన్నారు. అనంతరం ఆయా అంశాలపై రైతులు వెలిబుచ్చిన సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. ఇంకనూ ఈ నూతన చట్టంలో ఎలాంటి అంశాలు చేరిస్తే బాగుంటుందనే దానిపై సలహాలు సూచనలు అందించాలని అన్నారు.
- సమస్యలు పరిష్కరించాలని వినతి
స్థానికంగా నెలకొని ఉన్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ప్రజాప్రతినిధులు, రైతులు కలెక్టర్ ను కోరారు. సిరికొండలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్న సందర్భంగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ మాట్లాడుతూ, కాళేశ్వరం 21, 22 ప్యాకేజీ పెండింగ్ పనులను పూర్తి చేసి, సిరికొండ దర్పల్లి మండలంలోని 50 వేల ఎకరాలకు సాగునీటి వసతి సమకూర్చేలా ప్రభుత్వానికి నివేదిక పంపాలని కలెక్టర్ ను కోరారు. అలాగే, చెరువుల నుంచి నల్లమట్టి తరలించేందుకు రైతులకు అనుమతించాలని, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కూడా మట్టి తరలింపునకు అవకాశం కల్పించాలని, రైతులకు సబ్సిడీపై పచ్చిరొట్ట ఎరువు విత్తనాలు పంపిణీ చేయాలని, రైతులకు ఇదివరకు 522 సర్వే నెంబర్ లో పంపిణీ చేసిన అసైన్డ్ భూముల సమస్యలు పరిష్కరించి సమగ్ర సర్వే ద్వారా భూముల హద్దులు చూపాలని కోరారు. వీటిపై కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ, తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సదస్సులలో నిజామాబాద్ ఇంచార్జి ఆర్డీఓ స్రవంతి, స్థానిక అధికారులు, రైతులు పాల్గొన్నారు.
