Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 February 2025, 2:17 pm Posted by : ramakrishna

డిచ్ పల్లి డివిజన్ ఆలస్యమెందుకు?

. అక్కడికి వెళ్లేందుకు ససేమిరా అంటున్న నాయకుడు

. ప్రస్తుతం పవర్ హౌజ్ లో కొనసాగుతున్న కార్యాలయం

నిజామాబాద్, బతుకమ్మ: డివిజన్ కార్యాలయం డిచ్ పల్లిలో ప్రారంభించే అంశం రెండు అడుగులు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. వినియోగదారుల సౌకర్యార్థం డిచ్ పల్లిలో కొనసాగాల్సిన డివిజన్ కార్యాలయాన్ని యూనియన్ నాయకుడు తన కోసం పవర్ హౌజ్ లో కొనసాగిస్తున్నా అడిగే వారు లేకుండాపోయారు. డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు డిచ్ పల్లిలో ఓ భవనాన్ని సెలక్ట్ చేసినప్పటికీ అద్దె మాట్లాడడానికి వెనుకంజ వేస్తున్నారు. ఒకరు వద్దే వద్దంటుంటే, మరొకరమే పవర్ హౌజ్ లోనే ఉందామని పేజీ పెడుతున్నట్లు సమాచారం.

    డిచ్ పల్లి డివిజన్ ఏర్పాటులో జరుగుతున్న ఆలస్యంపై కంపెనీ సీఎండి కఠినంగా ఉన్నట్లు తెలిసింది. విభజనలో ఇన్నాళ్లు కాలయాపన జరిగింది కానీ ఇప్పుడు డివిజన్ కార్యాలయం అక్కడికి వెళ్లకుండా ఆపడం  సాధ్యం కాదని తలచి కార్యాలయం ఏర్పాటు కోసం భవనాన్ని వెదికారు. కమలాపూర్ రోడ్డులో ఉన్న భవనాన్ని పరిశీలించిన ఎస్ఈ రవీందర్, సహా అధికారులు ఓకే చెప్పినట్లు తెలిసింది. ప్రస్తుతం పవర్ హౌస్ లో కొనసాగుతున్న డిచ్ పల్లి డివిజన్ కార్యాలయ అధికారులు ఎస్ఈని తీసుకెళ్ళి అద్దె విషయం మాట్లాడాల్సి ఉండగా, ఓ నాయకుడు తప్పించుకునే వ్యవహారాన్ని నడుపుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 2022లో డిచ్ పల్లి డివిజన్ ఏర్పాటు కోసం ఉత్తర్వులు వెలువడగానే  అక్కడి సబ్ స్టేషన్ లో డివిజన్ కార్యాలయం అని బోర్డు తగిలించారు. ఇప్పటికీ ఉత్తర, ప్రత్యుత్తరాలు అదే చిరునామాపై కొనసాగుతున్నాయి. అలాంటప్పుడు డివిజన్ కార్యాలయాన్ని అక్కడే ఏర్పాటు చేయాల్సి ఉండగా, యూనియన్ నాయకుడు తన స్వార్థం కోసం ఏకంగా కార్యాలయాన్ని పవర్ హౌజ్ కు తరలించారు.  నిజామాబాద్ నగరంలోని పవర్ హౌజ్లో హాయిగా ఉండడంతో డిచ్ పల్లికి కార్యాలయాన్ని తరలించేందుకు అయిష్టత చూపుతున్నారు.

ఇక్కడే ఉంటె బాగుండు

డివిజన్ కార్యాలయాన్ని తరలించాలనే ధ్యాస ఆ విభాగంలో పని చేసే ముఖ్యాధికారికి లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పవర్ హౌస్ లో ప్రస్తుతమున్న డివిజన్ కార్యాలయం ముందే సబ్ డివిజన్ కోసం భవనాన్ని నిర్మిస్తున్నారు. కొత్తగా నిర్మించే దానిలోనే ఉందామని సదరు అధికారి మాట్లాడుతుండడంతో సిబ్బంది అవాక్కవుతున్నారు. వినియోగదారుల సేవలపై దృష్టి సారించాల్సిన అధికారి కార్యాలయం డిచ్ పల్లికి తీసుకెళ్లాలనే ఆలోచన లేకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. డివిజన్ కార్యాలయం ఎప్పుడు ప్రారంభమవుతుందా? అని వినియోగదారులు ఎదురు చూస్తూనే ఉన్నారు.

Why the delay in Ditch Palli Division?