Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 March 2025, 12:57 pm Posted by : ramakrishna

ఆ రేషన్ షాపుపై చర్యలు ఎందుకు లేవు?

. తనిఖీ చేసి 24గంటల గడిచినా పై అధికారులకు అందని నివేదిక
. ఫిర్యాదు అందిన నాలుగు రోజుల తరువాత అధికారి పరిశీలన
. స్టాక్ తక్కువ ఉన్నా చర్యలు తీసుకోని అధికారి
కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం కిష్టాపూర్ లోని రేషన్ షాపు(2905007) ఈ పాస్ మిషన్ లో 14 క్వింటాళ్ల 28కిలోల బియ్యం ఆన్ లైన్ లో నిల్వ ఉన్నట్లు చూపుతోంది. అయితే ఆ దుకాణంలో బియ్యం బస్తాలు లేకపోవడం గమనార్హం. దీనిపై ఎన్ ఫోర్స్ మెంట్ డీటీ ఖాజ కు ఫిర్యాదులు అందినా ఆయన నాలుగు రోజుల తరువాత స్పందించారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ఆ లోగా డీలర్ వేరే మండలం నుంచి పది క్వింటాళ్ల వరకు బియ్యాన్ని తీసుకవచ్చి నిల్వ చేశారని, ఆ తరువాత ఎన్ ఫోర్స్ మెంట్ డీటీ ఖాజా తనిఖీ చేశారని అంటున్నారు. బియ్యం రేషన్ దుకాణంలో లేవని ఫిర్యాదు అందిన సమయంలో సదరు అధికారి ఎందుకు తనిఖీలు నిర్వహించలేదనేది చర్చనీయాంశమైంది. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో షాపును తనిఖీ చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి రిజిస్టర్ తో పాటు ఈ పాస్ మిషన్ ను తీసుకొని సరిచూడగా బియ్యం నిల్వలో తేడా కనిపించినట్లు తెలిసింది.

అయితే అదే అధికారి క్లీన్ చిట్ ఇచ్చారని, స్థానికంగా కొందరి నుంచి సంతకాలు తీసుకున్నారని గ్రామస్తులు అంటున్నారు. రేషన్ దుకాణాన్ని తనిఖీ చేసి 24 గంటలు గడిచినప్పటికీ పైస్థాయి అధికారులకు నివేదిక అందలేదు. అయితే ఈ రేషన్ దుకాణ డీలర్ పై గతంలో సైతం కేసు నమోదు కావడం గమనార్హం. రేషన్ దుకాణం వ్యవహారంపై అధికారులను వివరణ కోరిన వారిని చోటామోటా నాయకులతో కలిసి డీలర్ బెదిరించడం కొసమెరుపు.

Why is there no action against that ration shop?