Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 September 2024, 9:41 pm Posted by : ramakrishna

డీసీసీ పగ్గాలు ఎవరికి?

  • త్వరలో  జిల్లా కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడు..?
  • రేసులో సీనియర్లు
  • ఎవరి అంచనాలు వారివే..?

నిజామాబాద్, బతుకమ్మ: జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న మానాల మోహన్ రెడ్డికి కార్పొరేషన్ పదవి కట్టబెట్టిన నేపథ్యంలో డీసీసీకి నూతన అధ్యక్షుడి నియామకం తప్పనిసరి అనే చర్చ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ పగ్గాలు ఎవరికి అప్పగిస్తారనేదానిపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో పార్టీ జిల్లా పగ్గాలు చేపట్టేందుకు పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ పగ్గాలు చేపట్టిన తరుణంలో.. ఆయా జిల్లాల్లో ప్రక్షాళన ప్రారంభమవుతుందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఓటమి పాలై, బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల ఇన్ చార్జీలుగా కొనసాగుతున్న ముత్యాల సునీల్ రెడ్డి, వినయ్ రెడ్డితోపాటు జిల్లా కేంద్రంలోని చెందిన సీనియర్ నాయకులు కేశ వేణు, అంతిరెడ్డి రాజిరెడ్డి, కౌడపు శరత్ కుమార్, మైనార్టీ నేత జావిద్ అక్రమ్, రూరల్ నియోజకవర్గానికి చెందిన బాడ్సి శేఖర్ గౌడ్, ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన యాల్ల సాయిరెడ్డి డీసీసీ రేసులో ఉన్నారు.

ఎన్నికల బరిలో నిలిచి.. పార్టీ వెన్నంటి ఉంటున్న నాయకులు

బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన ముత్యాల సునీల్ రెడ్డి, వినయ్ రెడ్డి ఓటమి తరువాత ఇన్ చార్జీలుగా కొనసాగుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, స్థానిక ఎమ్మెల్యేలతో సమానంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. సౌమ్ముడిగా, నిబద్ధత కలిగిన నాయకుడిగా పేరున్న సునీల్ రెడ్డికి డీసీసీ పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందని, ఏ పరిస్థితుల్లోనూ పార్టీని ముందుకు తీసుకెళ్లగలిగే సమర్థత ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొదటి నుంచి అగ్రెసివ్ గా ముందుకెళ్తున్న వినయ్ రెడ్డి సైతం డీసీసీ పగ్గాలను ఆశిస్తున్నారు. పార్టీలోకి వచ్చిన నాటి అందరితో తలలో నాలుకలా ఉంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వద్ద సైతం ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వినయ్ రెడ్డి ఆశావహుల్లో ముందున్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అనుచరుడిగా  గుర్తింపున్నఆలూర్ మండలం మిర్దాపల్లికి చెందిన యాల్ల సాయిరెడ్డి సైతం డీసీసీ ఆశిస్తున్నారు. ప్రస్తుతం బీ ఆర్ ఎస్ లో ఉన్న సురేశ్ రెడ్డి కి సన్నిహతుడైన సాయిరెడ్డి.. బాల్కొండ నియోజకవర్గానికి మూడు కార్పొరేషన్ పదవులు ఇచ్చిన నేపథ్యంలో డీసీసీ ఆర్మూర్ నియోజకవర్గానికి దక్కుతుందని, తనకే అవకాశం ఉంటుందంటున్నారు. నిజామాబాద్ నగరానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నరాల రత్నాకర్ డిసిసి పీఠం ఆశిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఉమ్మడి రాష్ట్రంలో పిసిసి కార్యదర్శిగా పనిచేసిన రత్నాకర్ ఇటీవల జరిగిన అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడ్డారు. ఆయన రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులను ఆశిస్తున్నారు ఒకవేళ అది కాకపోతే డిసిసి పదవిని ఇవ్వాలని కాంగ్రెస్ అగ్ర నేతలను కోరుతున్నారు

జిల్లా కేంద్రం నుంచి కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు

కరుడు గట్టిన కాంగ్రెస్ వాదులుగా పేరున్న కేశ వేణు, అంతిరెడ్డి రాజిరెడ్డి, మైనార్టీ నేత జావిద్ అక్రమ్, కౌడపు శరత్ కుమార్ డీసీసీ ఆశిస్తున్నారు. కేశ వేణుకు నుడా(నిజామాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ), అంతిరెడ్డి రాజిరెడ్డికి గ్రంథాలయ సంస్థ చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తారని ఊహాగానాలు జోరందకున్నాయి. పార్టీ అధిష్టానం సైతం ఇందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అయితే వీరిద్దరికి ఏ పరిస్థితుల్లోనైనా నామినేటెడ్ చైర్మన్ పదవులు దక్కని పక్షంలో డీసీసీ రేసులో ముందుంటారు. కేశవేణు నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా దశాబ్దకాలానికిపైగా పని చేస్తుండగా, గతంలో జిల్లా ఇన్ చార్జి అధ్యక్షుడిగా పని చేశారు. వక్ఫ బోర్డు చైర్మన్ గా, కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా పని చేసిన సీనియర్ నాయకుడు జావిద్ అక్రమ్ తానేమీ తక్కువ కాందంటున్నారు. అలాగే కాంగ్రెస్ సేవా దళ్ అధ్యక్షుడిగా పని చేసిన కౌడపు శరత్ కుమార్ సైతం ఆది నుంచి పార్టీ వెన్నంటే ఉంటూ సేవలందిస్తున్నారు. సీనియర్ నైన తనకు గుర్తింపు లభించకపోదనే గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇదిలా ఉండగా రూరల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఓబీసీ సెల్ నాయకుడు బాడ్సి శేఖర్ గౌడ్ డీసీసీ రేసులోకి వచ్చారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఆశిస్తున్న ఆయన.. పీసీసీ పగ్గాలు మహేశ్ కుమార్ గౌడ్ చేపట్టిన నేపథ్యంలో సామాజిక రాజకీయ కోణంలో తనకు అవకాశాలున్నాయంటున్నారు.