Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 May 2025, 2:57 pm Posted by : ramakrishna

దెయ్యం ఎవరు..? కోవర్టు ఎవరు..?

. కేసీఆర్ నుంచి కవితను దూరం చేస్తోంది ఆ ఇద్దరేనా..

. హరీశ్ రావు దారెటు.. మామకిచ్చిన మాటపైనే ఉంటారా?

. బావామరదళ్లు కొత్త పార్టీ స్థాపిస్తారా? బీఆర్ఎస్ లోనే బలాన్ని ప్రదర్శిస్తారా?

. బీఆర్ఎస్ అంతర్గత రాజకీయాలపై సర్వత్రా ఆసక్తి

నిజామాబాద్, బతుకమ్మ: కేసీఆర్ చుట్టూ దెయ్యాలు..? బీఆర్ఎస్ లో కాంగ్రెస్ కోవర్టులు..? కవిత లేఖ.. కేటీఆర్ ప్రెస్ మీట్.. హరీశ్ రావు అసహనం.. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఈ అంశాలే హాట్ టాపిక్. కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలు కేటీఆర్, సంతోష్ రావు అని, రాజకీయ వారసుడు కేటీఆరే అని భావిస్తున్న కేసీఆర్.. కవితకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడమే ఇందుకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కవిత లిక్కర్ కేసులో జైలుకు వెళ్లడం తండ్రీ కొడుకులు కేసీఆర్, కేటీఆర్ కు మింగుడు పడడం లేదని, అందుకే ఎల్కతుర్తి సభలో ఈ ప్రస్తావన రాలేదని బీఆర్ఎస్ లోని ఓ వర్గం నాయకులు అంటున్నారు. కవిత కేసుల విషయంలో బీజేపీని కేసీఆర్ టార్గెట్ చేయకపోవడం వెనుక కేటీఆర్, సంతోష్ రావు ఉన్నారని, రాజకీయ వారసుడు కేటీఆరే కాబట్టి అంతగా స్పందించాల్సిన అవసరం లేదనేది వారి అభిప్రాయం కాబట్టే పరిస్థితి ఇలా ఉందని మరో వర్గం నాయకులు చర్చించుకుంటున్నారు.

ఒకేసారి ఇద్దరికి చెక్..

బీఆర్ఎస్ లో హరీశ్ రావు, కవితకు ఒకేసారి చెక్ పెడుతున్నారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పార్టీ రజతోత్సవ సభ ఏర్పాట్లను ముందు హరీశ్ రావే అన్నీతానై చూసుకోవడం ప్రారంభించారు. ఆ దిశగా సభాస్థలం ఎంపిక, జనసమీకరణపై దృష్టి సారించడంతోపాటు వరంగల్ జిల్లాలో గ్రూపు రాజకీయాలు లేకుండా చేసి ఓ ఊపు తీసుకొచ్చారు. అయితే హరీశ్ రావు అన్నీతానై రజతోత్సవ సభ ఏర్పాట్లలో ముందుకు దూసుకెళ్తున్న తరుణంలో ఆయనకు ఉద్దేశపూర్వకంగానే బ్రేక్ లు లేశారు. ఆయనను హుటాహుటిన ఫామ్ హౌజ్ కు పిలిపించిన కేసీఆర్.. మనం అధికారంలో ఉన్నామా? ఇంత హంగామా ఎందుకు? అంటు ఒకింత అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో వెనక్కి తగ్గిన హరీశ్ ఆ తరువాత కేసీఆర్, కేటీఆర్ ను కలవలేదు. దీనికి తన తండ్రి అనారోగ్యాన్ని కారణంగా చూపి దూరంగా ఉన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో రజతోత్సవ సన్నాహక సమావేశాలకు మాత్రమే పరిమితమయ్యారు. రజతోత్సవ సభను హరీశ్ రావు సక్సెస్ చేస్తే ఆ క్రెడిట్ అంతా ఆయనకే వెళ్తుందని, ఆయన ప్రాబల్యం మరింత పెరుగుతుందనే కారణంతో వెనక్కి లాగారని హరీశ్ వర్గీయులు అంటున్నారు. ఇటీవల కాళేశ్వరం నోటీసులు అందుకున్న హరీశ్ రావు దానిపై కేసీఆర్ తో చర్చించేందుకు ఫామ్ హౌజ్ కు వెళ్లినప్పటికీ ఐదే ఐదు నిమిషాల్లో తీవ్ర అసహనంతో బయటికి వచ్చేశారని సమాచారం. తనను పొమ్మనలేక పొగపెడుతున్నా  కుటుంబ సెంటిమెంట్, కేసీఆర్ కు గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి పార్టీలో ఉంటున్నానని హరీశ్ రావు తన సన్నిహితుల వద్ద తన మనసులో మాట చెప్పినట్లు తెలుస్తోంది.

హరీశ్ తో కవిత రాజకీయ చర్చలు..?

కేసీఆర్ తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఆయన నుంచి తనను కుటుంబ సభ్యులే దూరంగా ఉంచుతుండడాన్ని జీర్ణించుకోలేని కవిత హరీశ్ రావుతో రాజకీయ చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. తాను మహిళన కాబట్టే వారసురాలిగా ఒప్పుకోవడం లేదని, తనను మెల్లిమెల్లిగా రాజకీయాలకు దూరం చేయాలనే కుట్ర జరుగుతోందని కవిత తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలో హరీశ్ రావుతో జత కలిస్తే కొత్త పార్టీ పెట్టడమా..? లేక బీఆర్ఎస్ లోనే తమ బలాన్ని ప్రదర్శించడమా? అనే దానిపై కవిత సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.