- పదవి కోసం పోచారం, రవీందర్ రెడ్డి వర్గాల మధ్య పోరు
- మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పదవి దక్కేది ఎవరికో..?
బతుకమ్మ , బాన్సువాడ : మూడు దశాబ్దాల పాటు బాన్సువాడ నియోజకవర్గం రారాజుగా పాలించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి కి, బాన్సువాడ కాంగ్రెస్ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం మధ్య పోరు సాగుతుంది. 30 ఏళ్ల పాటు పాలించిన పోచారానికి బాన్సువాడలో అడ్డు ఎవరూ లేకపోవడంతో తన రాజ్యం కొనసాగింది. 2023 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారస అభ్యర్థిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి రంగంలో ఉండగా, కాంగ్రెస్ అభ్యర్థిగా ఏనుగు రవీందర్ రెడ్డి, భాజపా అభ్యర్థిగా ఎండల లక్ష్మీనారాయణ మధ్య త్రిముఖ పోటీ జరిగింది. ఈ ఎన్నికల్లో భారస అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి పై విజయం సాధించారు. ఏ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమిపాలైతారో వారే ఆ నియోజకవర్గానికి బాధ్యులు, అంతేకాకుండా వారే ఎమ్మెల్యేలుగా ఉన్నట్టు భావిస్తాం అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన మేరకు ఏనుగు రవీందర్ రెడ్డి బాన్సువాడ కాంగ్రెస్ ఇంచార్జ్ గా ఉంటూ బాన్సువాడలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తున్నారు. భారాస నుంచి గెలిచిన పోచారం శ్రీనివాస్ రెడ్డి 6 నెలలు తిరగకముందే కాంగ్రెస్ లోకి చేరిపోయారు. ఇప్పటివరకు పోచారానికి అడ్డు అంటూ లేకపోవడంతో ఏనుగు రవీందర్ రెడ్డి అడ్డు రావడంతో బాన్సువాడ నియోజకవర్గంలో రెండు వర్గాలుగా కాంగ్రెస్ చీలిపోయింది. ఒకవైపు పోచారం వర్గం, మరొకవైపు ఏనుగు రవీందర్ రెడ్డి వర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే పోచారం శ్రీనివాస్ రెడ్డి తన వర్గానికి చెందిన కోటగిరి మార్కెట్ కమిటీ, వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ ల పదవులను ఆయన వర్గానికి చెందిన వారికి అంటగట్టారు. బీర్కూర్, బాన్సువాడ మార్కెట్ కమిటీ పదవులను నియమించాల్సి ఉంటుంది. అయితే బీర్కూర్ మార్కెట్ కమిటీ జనరల్ మహిళకు అవకాశం లభించింది. పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్గం నుంచి బీర్కూర్ మండలం నుంచి ఎనిమిది మంది రేసులో ఉండగా, ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం నుంచి అంబలి ప్రమీల రంగంలో నిలిచారు. రవీందర్ రెడ్డి వర్గానికి చెందిన ప్రమీలను కాదని పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్గం నసుర్లబాద్ మండలానికి చెందిన శ్యామలకు ఇవ్వాలని తెరపైకి తెచ్చింది. అయితే మార్కెట్ కమిటీ ఏర్పాటు అయినప్పుడు రెండుసార్లు కేటాయించారు. గతంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి కి ఎవరు అడ్డు చెప్పకపోవడం గులాబీ ప్రభుత్వం కొనసాగడం వల్ల ఆయన అనుకున్నదే అయింది. కానీ ప్రస్తుతం ఆయనకు ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం ద్వారా ఒత్తిడి పెరుగుతుంది. రెండుసార్లు నసుర్లబాద్ మండలానికి అవకాశం ఇచ్చారు, ఒక్కసారి బీర్కూర్ మండలానికి అవకాశం ఇచ్చారు, ఇప్పుడు కూడా బీర్కూర్ మండలానికి చెందిన వారికే మార్కెట్ చైర్పర్సన్ పదవి కోసం పోటీ పడుతున్నారు. వాస్తవానికి బీర్కూర్ కు తప్పనిసరిగా మార్కెట్ కమిటీ దక్కల్సి ఉంది. ఈ విషయంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్గానికి, ఏనుగు రవీందర్ రెడ్డి వర్గానికి మధ్య పోటీ నెలకొంది. తన వర్గానికి చెందిన వారికి చైర్ పర్సన్ పదవి ఇస్తానని పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటిస్తుండగా, తన వర్గానికి చెందిన వారికి చైర్పర్సన్ కావాలని ఏనుగు రవీందర్ రెడ్డి జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావుకు, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ ముందుకు తీసుకువచ్చారు. ఈ విషయంలో ఎంపీ సురేష్ షెట్కర్, ఏనుగు రవీందర్ రెడ్డి సూచించిన వ్యక్తులకే మార్కెట్ కమిటీ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎవరికీ దక్కుతుందో వేచి చూడాల్సిందే. పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్గాని కా, ఏనుగు రవీందర్ రెడ్డి వర్గానికా వేచి చూడాలి.