- రోడ్డుపై బైఠాయించి మహిళ నిరసన
రాజంపేట, బతుకమ్మ : నాతో కలిసి సహజీవనం చేశాడు.. ఫలితంగా కొడుకుని పుట్టించాడు.. అయినా నా భర్త ఎవరు.. నాకు పుట్టిన కొడుకు తండ్రి ఎవరు.. అంటూ ఓ మహిళ రాజంపేట ప్రధాన చౌరస్తాలో నిరసన వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళ్తే కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రానికి చెందిన పెద్దమ్మల్ల అంజమ్మ అనే మహిళ రాజంపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు జూకంటి మోహన్ రెడ్డి తనతో కొంతకాలం సహజీవనం చేశాడని తెలిపింది. ఫలితంగా కొడుకు పుట్టాడు ఇప్పటిదాకా రేషన్ కార్డు ఆధార్ కార్డు పాఠశాలలో తండ్రి పేరు ఆయనదే ఉంది ఇప్పుడు ఇతరుల పేరు మార్చి తనకు రావలసిన రేషన్ బియ్యాన్ని ఇవ్వకుండా తన పొట్ట కొడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనతో మోహన్ రెడ్డి సహజీవనం చేస్తే కొడుకు పుట్టాడని తెలిపింది. గతంలో ఆధార్ కార్డు, రేషన్ కార్డులో భర్త పేరుగా జూకంటి మోహన్ రెడ్డి పేరు ఉందని, గత నెల రోజుల క్రితం రేషన్ కార్డు, ఆధార్ కార్డుల నుంచి మోహన్ రెడ్డి పేరు తొలగించి శివరాములు అనే వ్యక్తి పేరును మోహన్ రెడ్డి మార్పించారని ఆరోపించింది. తన కుమారుడికి మోహన్ రెడ్డే తండ్రి అని ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేది లేదని భీష్ముంచుకుని రోడ్డుపై కూర్చుంది. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా పట్టు వీడటం లేదు. తనకు న్యాయం చేయాలని పోలీసుల కాళ్ళు మొక్కి వేడుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బలవంతంగా అంజమ్మను పోలీస్ వాహనం ఎక్కించేందుకు ప్రయత్నించారు. అయితే అంజమ్మ తనకు న్యాయం చేసే వరకు జరిగేది లేదని భీష్మించు కూర్చుంది. అనంతరం సంఘటన స్థలానికి రాజంపేట ఎస్సై పుష్పరాజు చేరుకొని అంజమ్మను సముదాయించారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తానని ఎస్సై హామీ ఇచ్చారు. అనంతరం పోలీస్ వాహనంలో అంజమ్మను స్టేషన్ కు తరలించారు.
