. . . ఆగని భూ బకాసురుల కబ్జాలు
. . . కనుమరుగవుతున్న ప్రభుత్వ భూములు
రుద్రూర్, బతుకమ్మ :
భూ బకాసురుల ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతుంది. ఖాళీగా భూమి ఉందంటే అది వరద కాలువనా లేక పంట కాలువనా, రహదారినా అని చూడడం లేదు. తర్వాత పొలాల వారికి నీళ్లు అవసరం, దారి అవసరం అని కూడా ఆలోచన లేదు. నాకు మాత్రం పది గుంటలు కలిసిందా, నాకు ఐదు గుంటలు కలిసిందా అని పోటీ పడుతున్నారు. కానీ తరువాత పొలాల వాళ్ళ గూర్చి ఆలోచన కొంచం కూడా లేక పోవడం ఎంతో బాధాకరం.

పది మీటర్ల వెడల్పు ఉన్న కాలువలు సైతం ఒక మీటర్ వెడల్పు కి రావడం కొన్నిచోట్ల పూర్తిగా అదృశ్యం కావడం బాధాకరం. కొందరు రాజకీయ బలంతో, కొందరు అధికారుల బలంతో ఇష్టారాజ్యాంగా భూమిని మాయం చేస్తున్నారు. ఏళ్ళ తరబడి అక్రమ కబ్జాలు ఉన్నా వీటి గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వాళ్ళు పట్టించుకోకపోవడం ఆలోచించాల్సిన విషయం. కొందరు రైతులు నిరంతర యుద్ధం చేస్తున్నా అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదు. ఈ భూకబ్జాల వలన కొందరు రైతుల పొలాలు వరదల సమయంలో పూర్తిగా మునిగిపోయి నష్ట పోవడం జరుగుతుంది. రహదారులు కూడా చిన్నవై పోతున్నాయి. కొందరు ప్రభుత్వ భూమిలోనే బోరు బావిలు సైతం త్రవ్వడంతో, ట్రాక్టర్ డ్రైవర్లు సైతం ఇబ్బంది పడుతున్నారు.

కొన్ని సందర్భాల్లో చిన్న సన్నకారు రైతులు తమ పశువులు సైతం వరద కాలువల వెంబడి, రహదారుల వెంబడి మేత తినేవి అని ఇప్పుడు కాలువలు లేకపోవడం వలన పశువులు అమ్ముకుంటున్న పరిస్థితి వచ్చిందని చెప్పుకుంటున్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో రుద్రూరు మరియు అక్బర్ నగర్ సరిహద్దున ఉన్నటువంటి మల్లయ్య గుట్టకి, నక్కలోర్రే వాగుకి వెళ్ళు రహదారి సర్వే నెంబర్ 109/1, నక్కలోర్రే వాగు దాని అనుబంధంగా ఉన్న వాగులు, పంట కాలువల భూ కబ్జా గూర్చి ప్రచురణ రావడంతో రైతులు మళ్ళీ మళ్ళీ న్యాయం కోసం రుద్రూర్ మండల రెవెన్యూ అధికారిని కలిసి తమకి న్యాయం చేయమని అడగడం జరిగింది.

అందుకు వారు వెంటనే ఈ విషయం గూర్చి, భూమి విషయం గూర్చి సర్వేయర్ కు, వరద కాలువలు, పంట కాలువలు గురించి నీటి పారుదల శాఖ అధికారికి అదే విధంగా రహదారి గూర్చి రహదారులు, భవనాలు శాఖ, పంచాయతీ రాజ్ శాఖ వారికి సమాచారం ఇచ్చి రెండు రోజుల వ్యవధిలోనే సమస్యకి పరిష్కారం చూపుతానని చెప్పి ఎవెరైతే అక్రమంగా ఆక్రమణ చేసారో అట్టి భూమిని పునరుద్దరణ చేసి, కాలువలకి రహదారులకి పూర్వవైభవం తీసుకొస్తానన్నారు. అదే విధంగా వరదల సమయంలో పొలాలకి నష్టం జరగకుండా చూస్తా అని హామీ ఇచ్చి రైతులపై తనకున్న అభిమానం చాటుకున్నారు. మండల రెవెన్యూ అధికారి తారాబాయి వెంటనే స్పందించి తమకి న్యాయం చేస్తాం అని చెప్పడంతో రైతులు హర్షం వ్యక్తం చేసారు.