Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 November 2024, 4:05 pm Posted by : ramakrishna

సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఎవరి కోసం?

. ఇప్పటికే పత్తి కొనుగోళ్లను ప్రారంభించిన దళారులు, వ్యాపారులు

. సోమవారం నుంచి తాము ప్రారంభిస్తామంటున్న అధికారులు

. ప్రైవేట్ వ్యాపారుల, దళారుల చేతుల్లో నష్టపోతున్న రైతులు

 

మార్కెట్ లోకి పత్తి పెద్ద మొత్తంలో వస్తున్నా ఇప్పటికీ సీసీఐ కొనుగోళ్లను ప్రారంభించలేదు. చేతుల్లో చిల్లిగవ్వలేని రైతుల పరిస్థితిని ప్రైవేట్ వ్యాపారులు, దళారులు ఆసరా చేసుకుని కొనుగోళ్ల జోరు పెంచారు. పత్తి మొత్తం ప్రైవేట్ వ్యక్తులు కొనుగోలు చేసిన తరువాత సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం ఎందుకు అని రైతులు ప్రశ్నిస్తున్నారు. తాము ప్రైవేట్ వ్యాపారులకు అమ్మిన తరువాత.. సీసీఐ ప్రైవేట్ వ్యక్తుల నుంచి పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తుందా? అని ప్రశ్నిస్తున్నారు. గతేడాది 60వేల క్వింటాళ్ల దిగుబడి రాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 3 నుంచి నాలుగు వేల క్వింటాళ్ల పత్తి దిగుబడి రాగా ప్రైవేట్ వ్యక్తులు కొనుగోలు చేసేశారు.

 మద్నూర్, బతుకమ్మ: పత్తి తీసే పనులు జోరందుకున్నా సీసీఐ కొనుగోలు కేంద్రాలు మాత్రం ప్రారంభం కాలేదు. పెద్ద ఎత్తున మార్కెట్ లోకి పత్తి వస్తుండడంతో ప్రైవేట్ వ్యాపారులు, దళారులు కొనుగోళ్ల జోరు పెంచారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) మాత్రం ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించలేదు. వ్యాపారులు, దళారులు పత్తిని కొనుగోలు చేశాక సీసీఐ వచ్చి రైతుల నుంచి కాకుండా ప్రైవేట్‌ వాళ్ల నుంచి ఎక్కువ మొత్తం కొనుగోలు చేస్తుందా.? అనే అనుమానాలు రైతులు వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు మాత్రం సోమవారం నుంచి కొనుగోళ్లను ప్రారంభిస్తామంటున్నారు. అకాల వర్షంతో దెబ్బతిన్న పత్తి పంటకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వడంతో పాటు పత్తికి మద్ధతు ధర పెంచి వర్షాలకు దెబ్బతిన్న పత్తిని సైతం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ ఏడాదైనా కలిసొస్తుందని ఆశించిన రైతులకు అనావృష్టి, అతివృష్టితో తీవ్ర దెబ్బ తగిలింది. కనీసం పండిన పంటకైనా గిట్టుబాటు ధర లభిస్తే కాస్త ఊరట లభిస్తుందని ఆశపడుతున్న రైతులకు సీసీఐ నిర్లక్షం కారణంగా ఇబ్బందులు తప్పడం లేదు. మద్నూర్ మండలంలో సుమారు 2466 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. డోంగ్లి మండలంలో 375 ఎకరాల్లో రైతులు పత్తి పండిస్తున్నారు. ఉమ్మడి మండలంలోనే  దాదాపు 2841 ఎకరాల్లో పత్తి సాగవుతోంది. ఎకరాకు కనీసం ఆరు క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ముందస్తుగా సాగు చేసిన పత్తి చేలల్లో తొలి దశ పత్తి ఏరుతున్నారు. మూడు దశల్లో రైతుల చేతికి వచ్చే పత్తిలో మొదటి, రెండో సారి మాత్రమే అధిక మొత్తంలో దిగుబడి వస్తుంది. తొలి సారి ఏరే పత్తిని నిల్వ చేయకుండా మొత్తాన్ని విక్రయిస్తారు. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు, దళారులు పత్తిని కొనుగోలు చేస్తున్నారు.

సీసీఐ కొనుగోళ్లు ఆలస్యమే..

సీసీ ఐ కొనుగోళ్లను ప్రారంభించకపోవడం.. దీపావళి సందర్భంగా చేతిలో చిల్ల గవ్వలేక సతమతమైన రైతులకు ప్రైవేట్ వ్యాపారులు, దళారులే దిక్కయ్యారు. రైతుల అవసరమే ఆయుధంగా మలుచుకున్న వ్యాపారవేత్తలు గత వారం రోజులుగా క్వింటాల్ కు రూ.7021 చొప్పున విక్రయించారు. శనివారం ధరను రూ.7071కి పెంచారు. సిసిఐ మద్దతు ధర రూ.7,500 ప్రకటించగా,  రైతులు క్వింటల్ కు సగటున రూ.429 నష్టపోతున్నారు. సీసీఐ కొనుగోళ్లు మాత్రం ఇంకా ఆలస్యమయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి.

 వర్షాల వల్ల పత్తికి నష్టం

ఈ సారి పత్తి పంటకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. మొదట్లో విత్తనాలు వేసేందుకు అనువైన వర్షాలు పడలేదు. పైరు ఏపుగా పెరిగి పూతకు వచ్చిన దశలో భారీ వర్షాలు పడ్డాయి. దాంతో పత్తి పైర్లు నీట మునిగాయి. పూత, కాయ నేలరాలింది. చెట్టు కొమ్మలు నీటిలో వాలడంతో తెగుళ్లు సోకి దెబ్బతిన్నాయి. రైతుల నుంచి పత్తిని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు వ్యాపారవేత్తలు. పత్తి రైతులు మద్దతు ధరను కూడా పెంచాలని కోరుతున్నారు.

 అధికారులకు తెలిపాం

. రాంనాథ్ రావు, వ్యవసాయ మర్కెట్ సెక్రెటరీ

సీసీఐ అధికారులకు ప్రస్తుత పరిస్థితిని తెలిపాం. వాళ్లు త్వరలోనే వచ్చి సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి అధికారుల ఆదేశాల మేరకు ప్రారంభిస్తారు.

Who are CCI buying centers for?