Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 November 2024, 3:54 pm Posted by : ramakrishna

టౌన్‘ప్లానింగ్’ ఎక్కడ?

. ఆర్మూర్ లో అక్రమ నిర్మాణాల జోరు

. పోటాపోటీగా బహుళ అంతస్తుల నిర్మాణాలు

. చేతులు మారుతున్న ముడుపులు

. టౌన్ ప్లానింగ్ స్పందించదు.. టాస్క్ ఫోర్స్ పట్టించుకోదు

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో భారీ భవంతులు, అపార్ట్ మెంట్లతోపాటు అక్రమ నిర్మాణాలు జోరుగాసాగుతున్నాయి. నిబంధనలను బేఖాతరు చేస్తూ వందల సంఖ్యలో నిర్మాణాలను కొనసాగుతున్నా అటు టౌన్ ప్లానింగ్ అధికారులు, ఇటు టాస్క్ ఫోర్స్ విభాగం పట్టించుకోవడం లేదు. దీనికి కారణంగా ముడుపులు  చేతులుమారడమేననే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. టీ ఎస్-బీ పాస్ ప్రకారం దరఖాస్తు చేసుకోకుండానే భవన నిర్మాణాలు చేపడుతున్నారు. మరికొన్ని చోట్లు తీసుకున్న అనుమతులకు, చేపడుతున్న నిర్మాణాలకు సంబంధం ఉండడం లేదు. స్థానిక ప్రజాప్రతినిధుల అండతో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయని పట్టణవాసులు అంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లు. అదనపు అంతస్తులు వేసినా పట్టించుకునే వారే లేరంటున్నారు. అక్రమ నిర్మాణాలను గుర్తించినా చర్యలకు అధికారులు వెనకడుగు వేస్తున్నారు. ఎక్కడైనా నిర్మాణ పనులు ప్రారంభం కాగానే కొందరు ప్రజాప్రతినిధులు  అక్కడ వాలుతున్నారు. పని సజావుగా సాగాలంటే ఎంతో కొంత ముట్ట చెప్పాల్సిందే అంటూ డబ్బులు పిండుకుంటున్నారు. నిబంధనల మేరకు నిర్మించే వారికి సైతం లంచాల బెడద తప్పడంలేదు. ముడుపులు ఇవ్వని వారిపైకి అధికారులను ఉసిగొలిపి చుక్కలు చూపిస్తారు. అపార్ట్మెంట్లు. షాపింగ్ కాంప్లెక్స్ లకు లక్షల్లో ముట్ట చెప్పాల్సిందే. 110 గజాల స్థలంలో నిర్మించే ఇంటికీ రూ.10వేల చొప్పున ఇవ్వాల్సిందే. భారీ షాపింగ్ కాంప్లెక్స్ లు నిర్మించే వారి వద్ద నుంచి ఏకంగా రూ.10 లక్షల నుంచి రూ.20లక్షల వరకే వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ఎల్ఆర్ఎస్ పేరుతో తనిఖీలకు డుమ్మా

అక్రమ నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారికి ఫిర్యాదులు వెళ్తున్నా ఎల్ ఆర్ ఎస్ పనులు ఉన్నాయంటూ తనిఖీలకు వెళ్లడం లేదని పలువురు అంటున్నారు. మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై వార్డు ప్రజలు ఫిర్యాదులు చేసిన ఎల్ఆర్ఎస్ బిజీలో ఉన్నాననే సమాధాన ఇస్తున్నారని అంటున్నారు. సదరు అధికారి ఉన్నంతకాలం అక్రమ నిర్మాణాలు ఆగవని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు.

అందినకాడికి దండుకునుడే..

మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అందిన కాడికి దండుకుందామనే ఆలోచనతో పలువురు ప్రజాప్రతినిధులు పోటీపడుతున్నారు. అసైన్డ్, ప్రభుత్వ, వెంచర్ లలోని 10శాతం స్థలాలకు సంబంధిత అధికారులతో కలిసి ఇంటి నంబర్లను ఇప్పిస్తున్నారు. ఇటీవల ఓ ప్రజా ప్రతినిధి పెర్కిట్ లో అపార్ట్ మెంట్ నిర్మాణదారుల నుంచి  రూ.25 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. ఇందులో సంబంధిత అధికారులకు సైతం ముడుపులు అందాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వసూల్ విషయం తెలిసి మరో ప్రజా ప్రతినిధి డబ్బులు వసూలు చేసిన ప్రజాప్రతినిధిపై ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం.