- 9 టీంలతో ముమ్మరంగా గాలింపు
- రియాజ్ ను పట్టిస్తే రూ.50 వేల క్యాష్ రివార్డు
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సీసీఎస్ కానిస్టేబుల్ ను హత్య చేసి మరో ఇద్దరు పోలీసులను తీవ్రంగా గాయపర్చిన సస్పెక్ట్ షీట్ కలిగిన రియాజ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న రియాజ్ ను పట్టుకునేందుకు 9 బ`దాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. శుక్రవారం రాత్రి నుంచి పోలీసు టీంలు రియాజ్ కోసం వేట కొనసాగిస్తున్నాయి. మహారాష్ట్ర పరారీ అయ్యారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పరారీ సమయంలోనూ రియాజ్ సన్నిహితుల బైక్ పై పరారీ అయ్యారని చెబుతుండగా, పారిపోయేందుకు బైక్ దొంగతనం చేసి పారిపోయాడనే వాదనలు కూడా ఉన్నాయి. ఈ నెల 17న పరారీలో ఉన్న రౌడిషీటర్ సమద్ తో పాటు రియాజ్ ఉండగా వారిద్దరిని పట్టుకునేందుకు వెళ్లిన సీసీఎస్ పోలీసులు నాగారం ప్రాంతంలో వెళ్లిన విషయం తెల్సిందే. అక్కడ సమద్ తప్పించుకోగా రియాజ్ ను పట్టుకుని విచారణ కోసం సీసీఎస్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రమోద్ అనే కానిస్టేబుల్ ను కత్తితో పొడిచి రియాజ్ పారిపోయిన విషయం తెల్సిందే. రియాజ్ పై ఇప్పటి వరకు బైక్ దొంగతనాలు, ఇళ్ళలో దొంగతనాలు, చైన్ స్నాచింగ్ కేసులు ఉండగా సమద్ అనే రౌడిషీటర్ తో కలిసి దాడి చేసిన కేసులు మాత్రమే ఉన్నాయి. రియాజ్ తన సహచరుడైన సమద్ కోసం ఇటీవల కాలంలో దొంగతనాలను జోరు పెంచినట్లు తెలిసింది. సమద్ ప్రత్యర్థులను టార్గెట్ చేసేందుకు ఆదాయం కోసం చోరిలను చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. హత్య కేసులు, హత్యాయత్నం కేసులు నమోదైతే కోర్టులు, జైలు సంబంధిత అవసరాల కోసం డబ్బులను సమకూర్చుకునేందుకే దొంగతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ప్రత్యర్థులను మట్టుపెట్టే వరకు దొరికేది లేదని సోషల్ మీడియాలో పోస్టులు చేసినట్లు కూడా వినికిడి. అందులో భాగంగానే నిజామాబాద్ చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో తిరుగుతున్నా నిన్నటి వరకు రౌడిషిటర్లు సమద్, చోటా సోహెల్, రియాజ్ లు పోలీసులకు చిక్కలేదని తెలిసింది. ఇటీవల ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 9 దొంగతనాల కేసులో వారి ప్రమేయం ఉందన్న వాదనలు ఉన్నాయి. ఈ మేరకు పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైనట్లు తెలిసింది. మొన్నటికి మొన్న మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనంగా టేకు చెట్లను నరికి ఎత్తుకెళ్లిన కేసులో సంబంధిత గ్యాంగ్ ప్రమేయం ఉందని ఎఫ్ఐఆర్ లో నమోదు చేసినట్లు సమాచారం. రియాజ్ కోసం పోలీసు శాఖ గాలింపు చర్యలు చేపట్టగా అతన్ని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలనే డిమాండ్ పెరిగింది. జిల్లా చరిత్రలో తొలిసారి రౌడిషీటర్ చేతిలో పోలీసు కానిస్టేబుల్ హత్య కు గురి కావడం కలవరానికి గురి చేసింది. పోలీసు శాఖ చేపట్టిన ఆపరేషన్ ను ముందుకు సాగించేందుకు కొన్ని ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. ప్రధానంగా దొంగతనాలు, దాడులు చేసిన తర్వాత వారి షెల్టర్ జోన్ల కోసం పోలీసు శాఖ వేట మొదలుపెట్టింది. 12 గంటలైన హంతకుడు రియాజ్ ఆచూకీ దొరకకపోవడంతో ఉదయం వేళ హంతకుడిని పట్టించిన వారికి రూ.50 వేల క్యాష్ రివార్డు ఇస్తామని పోలీసు కమిషనర్ సాయిచైతన్య ప్రకటన చేశారు. పోలీసు కానిస్టేబుల్ హత్య విషయంలో ఏకంగా పోలీసు బాస్ శశిధర్ రెడ్డి సీరియస్ గా ఉండడంతో అంత్యక్రియలకు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి హాజరుకావడంతో పోలీసులు రియాజ్ ఆచూకీ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
