- ఫోర్జరీ డాక్యుమెంట్లలో దిట్ట.. బ్యాంకర్లతో మిలాఖత్
- వేల మందికి రుణాల మంజూరులో కీలక పాత్ర
- అరెస్టు చేశారని జోరుగా ప్రచారం
- పోలీస్ శాఖ గోప్యత పై విమర్శల వెల్లువ
నిజామాబాద్, బతుకమ్మ : ట్రావెల్ మూర్తిని ఎందుకయ్యా వేధిస్తున్నారటా.. ఆయన మంచివారటా.. వీలైతే అతనికి సన్మానాలు.. సత్కారాలు చేయండి గానీ.. వేధించకండి ఇది జులాయి సినిమాలో ఓ పోలీసు అధికారిగా ఉన్న రాజేంధ్రప్రసాద్ సినిమా డైలాగ్. ట్రావెల్ మూర్తిగా పాత్ర పోశించిన బ్రహ్మజీ ఫోర్జరీ డాక్యుమెంట్లతో చాలా మందిని విదేశాలకు పంపిస్తుంటాడు. పోలీసులు అతన్ని విచారణకు పిలిపించగానే ఆగమేఘాల మీద ఉన్నత స్థాయి నుంచి ఒత్తిళ్ళు రావడంతో ఏసీపీగా ఉన్న రాజేంధ్రప్రసాద్ కు కింది స్థాయి సిబ్బందిని ట్రావెల్ మూర్తిని విచారించొద్దని ఆదేశాలిస్తాడు.
ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలోని ఒక ఘరానా చీటర్ విషయంలోనూ ఇదే రిపీట్ అవుతుందనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే అతను ఒకటో.. రెండో పదో ఇరవయో కాదు.. ఏకంగా వందల సంఖ్యలో మందికి తప్పుడు డాక్యుమెంట్ లు, ఫోర్జరీ సంతకాలతో రుణాలను ఇప్పించిన ఘనుడు. వందల మందికి రుణాలను ఇప్పించి బ్యాంకులకు రుణాలను ఎగ్గొట్టిన ఫోర్జరీ సూత్రదారిని నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ సబ్ డివిజన్ లో అరెస్టు చేశారని జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే సదరు కేటుగాడు కొన్ని రోజులుగా కనిపించకపోవడంతో పోలీసులు అరెస్టు చేసి ఉంటారని అందరూ అంటున్నారు. కానీ పోలీసులు మాత్రం ఎక్కడా ఫోర్జరీ డాక్యుమెంట్ల తయారీలో సూత్రదారిగా ఉన్నవ్యక్తిని అరెస్టు చేసినట్లు గానీ, రిమాండ్ కు తరలించినట్లు గానీ ప్రకటించకపోవడంతో సందిగ్ధం నెలకొంది. బ్యాంకుల వద్ద రుణాలు తీసుకోవడంలో, కోట్ల రుపాయాలను ఎగవేతలో సూత్రదారిని అనామకుడిలా అరెస్టు చేశారా, రిమాండ్ కు తరలించారా అంటే పోలీస్ శాఖాధికారులు కిమ్మనడం లేదు.
సదరు కేటుగాడు ఆర్మూర్ పట్టణంతో పాటు డివిజన్ లో అనేక మందికి నకిలీ పత్రాలు, తప్పుడు వాల్యుయేషన్, లీగల్ ఒపీనియన్ పత్రాలు సృష్టించేందుకు వాడే స్టాంప్ లను తయారు చేయించుకుని బ్యాంక్ అధికారులతో కుమ్మకై పరిమితికి మించి రుణాలు ఇప్పించినట్టు తెలిసింది. బ్యాంకుల్లో లోన్లు ఇప్పించే బ్యాంక్ డైరెక్ట్ సర్వీస్ ఏజెన్సీ (బ్యాంక్ డీఎస్ఏ)గా గత కొన్నేళ్ళ క్రితం అవతారం ఎత్తాడు కేటుగాడు. అతడు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ నాయకులతో కలిసి దందాలు ప్రధానంగా రుణాల దందాను జరిపాడనే విషయం అందరికి తెలుసంటారు. బ్యాంక్ మేనేజర్లను, ఫీల్డ్ ఆఫీసర్లను మచ్చిక చేసుకొని బ్యాంక్ అధికారి ఎవరు ఉన్నా ఆయన ట్రాప్ లో పడిపోతారు. అన్ని రకాల విద్యలు తెలిసిన సదరు డిఎస్ఏ రుణాలు ఇప్పించే వాళ్ళ నుంచి పెద్ద ఎత్తున కమీషన్లు దండుకుంటాడు అని ప్రచారం . కనీసం 5 శాతం కాగా ఏదైనా డాక్యుమెంట్స్ సరిగా లేకపోయినా, ఏదైనా లిటిగేషన్ ఉంటే 10 శాతం పైగా కమిషన్ దండుకుంటాడు. ఇందులో నుంచి బ్యాంక్ అధికారులకు, ఇతర పత్రాలు ఇచ్చే వాళ్ళకు కొంత ముట్టజెబుతాడు. ఇక బ్యాంక్ చుట్టు తిరుగకుండానే రుణం మంజూరీ అవుతుంది. ఆర్మూర్ సబ్ డివిజన్ లో గత దశాబ్ధ కాలంగా దళారులు బ్యాంక్ అధికారులు ములాఖత్ అయి పరిమితికి మించి రుణాలు ఇస్తున్నారు. ఇలా ఆర్మూర్ పట్టణంతో పాటు డివిజన్ లో అనేక మంది నకిలీ పత్రాలు, తప్పుడు వాల్యుయేషన్, లీగల్ ఒపీనియన్ పత్రాలు సృష్టించి రుణాలు బ్యాంకుల నుంచి ఇప్పించిన ఉదంతం బయటకు వచ్చింది. భీంగల్ మండలంలోని ఒక గ్రామానికి చెందిన పంచాయితీ కార్యదర్శి, ఆలూర్ మండలానికి చెందిన మరో గ్రామ పంచాయితీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు ఆర్మూర్ డివిజన్ కు చెందిన ఘరానా కేటుగాడిని నేర నియంత్రణ విభాగం అధికారులు అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిసింది. రెండు గ్రామ పంచాయితీలకు చెందిన కార్యదర్శులు స్టాఫ్ ముద్రలు తయారు చేసి, సంతకాలు పెట్టి ఫోర్జరీ పత్రాలు సృష్టించాడు. ఈ విషయంలో గొడవ జరుగడంతో పోలీసు స్టేషన్ వరకు వెళ్లింది. దీనిపై పోలీసులు ఆరా తీసి, విచారణ చేపట్టగా అనేక రకాల స్టాంప్ ముద్రలు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. వందల రుణాలు ఇప్పించినట్లు స్పష్టం అయినట్లు తెలిసింది. ఇటీవల ఓ బీఆర్ఎస్ నేతకు రూ.3 కోట్ల 50 లక్షల రుణం ఇప్పించినట్లు చర్చ జరుగుతుంది. నిజానికి ఆయన భవనానికి అంత పెద్ద హౌజింగ్ లోన్ ఇవ్వడం కుదరదు. కానీ ఏదో మాయాజాలం చేసి ఇప్పించినట్లు ప్రచారం జరుగుతుంది.
బ్యాంకుల్లో అక్రమంగా ఫోర్జరీల పత్రాలతో రుణాలు ఇప్పించిన ఘనుడికి పోలీసులు బాసటగా నిలిచినట్లు ఆర్మూర్ డివిజన్ అంతటా జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇందుకు పోలీసుల వైఖరి బలం చేకూర్చుతుంది. ఏదో చిన్న పాటి నేరం చేసి పట్టుబడితే బహిర్గతం చేసే పోలీసులు ఘరానా మోసగాడి అరెస్టును గోప్యంగా ఉంచడం అనుమానాలకు తావిస్తోంది. రూ.కోట్ల రుణాలు ఇప్పించడం వెనుక నకిలీ పత్రాల సృష్టించాడని పోలీసుల విచారణలో తేలిన కేసుల నమోదుకు తాత్సారం , అరెస్టు చేయకుండా తతంగం జరుగడం పై ఆరోపణలు ఉన్నాయి. అయితే కేసు లేకుండా తప్పించేందుకు పెద్ధ ఎత్తును డబ్బులు చేతులు మారినట్లు తెలిసింది. జిల్లాలో ఒక పోజిషన్ లో ఉన్న ఉన్నాతాధికారి ద్వార డివిజన్ లోని మరో అధికారికి ఉత్తర్వులు రావడంతో పోలీస్ బాస్ కు తెలియకుండానే చిన్నా చితక చీటింగ్ కేసు మాదిరిగానే ఘరానా చీటర్ కేసును నీరుగార్చేందుకు యత్నం జరిగిందని ప్రచారం జరుగుతుంది. ఒక ప్రజా ప్రతినిధి ద్వారా పోలీసులపై ఒత్తిడి చేసినట్లు అందుకే ఒక అధికార పార్టీ నేతలు తమ ప్రమేయం లేదని కాని కొందరు పైరవీకారుల వల్లనే గుట్టు చప్పుడు కాకుండా కేటుగాడిని కటకటాల వెనక్కు పంపించారని ప్రచారం జరుగుతుంది. రాచమర్యాదలలో ఎలాంటి లోటు రాకుండా, బెయిల్ కు అనుకులంగా ఉండే విధంగా సమయాన్ని సెట్ చేసి అరెస్టు చేసినట్లు తెలిసింది. పెద్ద మొత్తంలో తప్పుడు పత్రాలు సృష్టించి బ్యాంకులను మోసం చేసి, రుణ గ్రహీతల నుంచి పెద్ద మొత్తంలో వసూల్ చేసిన వ్యక్తికి ఖాకీల సహకారంపై ఆర్మూర్ అంతటా కోడై కుస్తున్నప్పటికి పోలీస్ శాఖ గోప్యత పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యులకు ఒక న్యాయం, కాసులు (లంచాలు) ఇచ్చేవాడికి మరోన్యాయం అనే దానిపై చర్చ జరుగుతుంది.