- కామారెడ్డి వైపా.. నిజామాబాద్ అర్బన్ కేనా..
- సందిగ్ధంలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్
- మైనార్టీ ఓట్లు అధికంగా ఉన్న అర్బన్ వైపేనా
కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి నియోజకవర్గం పేరు చెప్పగానే అందరికీ గుర్తువచ్చే పేరున్న నేత షబ్బీర్ అలీ.. కామారెడ్డి అంటే షబ్బీర్ అలీ, షబ్బీర్ అలీ అంటే కామారెడ్డి అనే రెంజ్ లో పేరు సంపాదించుకున్నారు.. 2023 లో కాంగ్రెస్ పార్టీలో జరిగిన అనూహ్య పరిమాణాల నేపథ్యంలో తన పాత స్థానం కామారెడ్డిని త్యాగం చేశారు సీనియర్ నేత.. ప్రస్థుత సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి నుండి బరిలోకి దిగటంతో ఆయన నిజామాబాద్ అర్బన్ కు వలస వెళ్లాల్సి వచ్చింది..ఇది ఆయన రాజకీయ జీవితంలో అనూహ్య పరిణామంగా చెప్పుకుంటారు.. ఏదో ఎన్నికల వరకే నిజామాబాద్ అర్బన్ కు వెళ్లారు అయినా కామారెడ్డి నేతగానే భావించారు. ఆయన కూడా అలానే భావించారట.. అపుడు జరిగినా ఎన్నికల్లో ఓటమిపాలు కావటంతో తన స్వంత స్థానం కామారెడ్డికి వచ్చేస్తారు అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఆయన అర్బన్ పై మక్కువ పెంచుకున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇక రాబోయే రోజుల్లో నిజామాబాద్ అర్బన్ నుండే తన ప్రస్థానం కొనసాగించాలని భావిస్తున్నారట..ఇందులో భాగంగా పూర్తిస్థాయిలో అర్బన్ పై దృష్టి పెట్టారు.. మైనారిటీ ఓట్లు అధికంగా ఉండే అర్బన్ స్థానం తనకు కలిసి వస్తుందని భావిస్తున్నారట. అందుకే ఇక్కడ స్వంత టీమ్ ఏర్పాటుపై దృష్టి పెట్టారు. నియోజకవర్గాన్ని చుట్టేస్తూ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుని హోదాలో జిల్లా కేంద్రంలో అన్ని తానై వ్యవహరిస్తున్నారు. వారంలో రెండు మూడు సార్లు అర్బన్ లో పర్యటిస్తూ తన క్యాడర్ ను పెంచుకోవటంతో పాటు ముస్లిం మత పెద్దలు, ఇతర హిందూ కుల సంఘాలకు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు కామారెడ్డి నియోజకవర్గంలో కూడా తన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే సొంత నియోజకవర్గంకు వెళ్తారా… కొత్త నియోజకవర్గం అనే సంధిగ్ధం ఏర్పడింది.
- 9సార్లు పోటీ చేస్తే 2సార్లు గెలిచిన షబ్బీర్ అలీ..
సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ మంత్రి షబ్బీర్ అలీ 9సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి 2 సార్లు 1989, 2004లో మాత్రమే విజయం సాధించారు. 1970లో ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1987లో మాచారెడ్డి మండలం ఎంపీపీగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 1989లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి యూసుఫ్ అలీ పై 12978 ఓట్ల తేడాతో మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై, 31 ఏళ్లకే చెన్నారెడ్డి మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా, మత్స్యశాఖ ఇన్‌చార్జ్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. ఆయన 1994, 1999 ఎన్నికల్లో ఓడిపోయి తిరిగి 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మంత్రి వర్గంలో విద్యుత్, బొగ్గు, మైనారిటీ సంక్షేమం, వక్ఫ్, ఉర్దూ అకాడమీ శాఖల మంత్రిగా పని చేశాడు. షబ్బీర్ అలీ 2009లో జరిగిన ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుండి ఓటమిపాలై, తెలంగాణ ఉద్యమ సమయంలో 2010లో జరిగిన ఎల్లారెడ్డి నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్‌ఎస్ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి చేతిలో ఓడిపోయాడు. ఆయన 14 మార్చి 2013న ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. షబ్బీర్ అలీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2014లో టీపీసీసీలో ప్రచార కమిటీ ఉపాధ్యక్షుడు, ఎన్నికల సభ్యునిగా నియమితుడయ్యాడు. ఆయన 2018లో ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన తెలంగాణ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా పని చేశాడు. షబ్బీర్ అలీ 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో నిజామాబాదు అర్బన్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. ఆయనను 2024 జనవరి 20న తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ శాఖల ప్రధాన సలహాదారుగా నియమించింది.
షబ్బీర్ అలీ కామారెడ్డి, ఎల్లారెడ్డి, నిజామాబాద్ అర్బన్ నుంచి మొత్తం 9సార్లు పోటీ చేయగా రెండు సార్లు గెలుపొంది మంత్రిగా పని చేశారు. కామారెడ్డి అసెంబ్లీ నుంచి నుండి ఏడు సార్లు పోటీచేసిన షబ్బీర్ అలీ 1989, 2004 లో ఎమ్మెలే గా గెలిచారు. అందుకే నిజామాబాద్ అర్బన్ పైనే ఈసారి ఆశలు పెటుకుకున్నట్లు తెలుస్తుంది.. అంతే కాదు నిజామాబాద్ అర్బన్ లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండటం పార్టీలో ఎక్కువ పోటీ లేకపోవటంతో ఇక్కడి నేతలు కూడా తనకు పూర్తి సహకారం అందిస్తారు ఈసారి గెలుపు కూడా సులభం అని భావిస్తున్నారట. గత అసెంబ్లీ ఎన్నికల్లో అర్బన్ నుండి పోటీ చేసినప్పటికీ తక్కువ సమయం ఉండటం, అనూహ్యంగా నిజామాబాద్ కు వలస రావాల్సి రావటం, నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో పర్యటించే సమయం లేకపోవటంతో ఓటమి చెందానిని అందుకే ఈసారి ముందస్తుగా పక్క ప్రణాళికలు వేస్తున్నారట. ప్రస్తుతం పార్టీ అధికారంలో ఉండటం, అర్బన్ ప్రజలతో మమేకం అయ్యేందుకు కావాల్సినంత సమయం ఉండటంతో ఇక తనకు అర్బన్ లో తిరుగు ఉండదని భావిస్తున్నారట. షబ్బీర్ అలీ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయి, ఆయన అంచనాలు ఎంతవరకు సాధ్యమవుతాయి తెలియాలంటే రాబోయే ఎన్నికల వరకు వేచి చూడాలి.
రెండు నియోజకవర్గాలఫై ఫోకస్ పెట్టిన షబ్బీర్ అలీ ఎటు వెళ్తారు.. ఏ నియోజకవర్గం ఎంచుకుంటారు అనే సంధిగ్ధం నెలకొంది. సొంత నియోజకవర్గమా.. మైనారిటీలు అత్యధికముగా ఉన్న నిజమాబాద్ కు పోతారా అని నాయకులు, కార్యకర్తలు సైతం ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో షబ్బీర్ అలీ మనసులో ఏముందో తేలాల్సిన సంకట పరిస్థితి నెలకొంది. మరికొన్ని రోజుల్లో ఏ నియోజకవర్గమే తేలే అవకాశం ఉందని పార్టీ శ్రేణుల్లో చర్చ మాత్రం జోరుగా సాగుతుంది.