Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 June 2026, 8:41 pm Posted by : ramakrishna

మెట్రో నిధులు ఎక్కడ ఆగిపోయాయి ?

 

. . . ఐఆర్ఎఫ్‌సీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రశ్

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

హైదరాబాద్ మహానగర అభివృద్ధికి అత్యంత కీలకమైన మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టు నిధుల విడుదలలో జాప్యం ఎందుకు జరుగుతోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్‌సీ)ను ప్రశ్నించారు. ఎల్ అండ్ టీ నుంచి హైదరాబాద్ మెట్రో మొదటి దశను స్వాధీనం చేసుకునేందుకు అవసరమైన అన్ని ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు పూర్తయినా, విడుదల కావాల్సిన రూ.13,600 కోట్ల రుణం ఇప్పటికీ అందకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ధనసరి అనసూయ సీతక్క, వాకిటి శ్రీహరి, మహమ్మద్ అజారుద్దీన్ తదితర ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి మాట్లాడారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు, పెట్టుబడులను మరింతగా ఆకర్షించేందుకు మెట్రో విస్తరణ అత్యవసరమని సీఎం స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) ఇస్తే, కేంద్రం నుంచి ఒక్క రూపాయి సాయం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం ఈక్విటీతో రెండో దశ మెట్రో విస్తరణ చేపట్టేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఎల్ అండ్ టీతో కుదిరిన ఒప్పందం ప్రకారం మెట్రో మొదటి దశను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి ఉందని, కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఆ ప్రక్రియను పూర్తిచేశామని చెప్పారు. జపాన్‌కు చెందిన ఆర్థిక సంస్థ నుంచి నిధులు ఇప్పటికే ఐఆర్ఎఫ్‌సీ ఖాతాలో జమయ్యాయని, అయినప్పటికీ ఒప్పందం ప్రకారం ఎల్ అండ్ టీకి చెల్లించాల్సిన నిధులు విడుదల కాకపోవడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు చరిత్రను ప్రస్తావిస్తూ, 2009లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.15 వేల కోట్ల నుంచి రూ.22 వేల కోట్లకు పెరిగిందన్నారు. గౌలిగూడ-ఫలక్‌నుమా మార్గం మాత్రం ఇప్పటికీ పూర్తి కాలేదని గుర్తుచేశారు. గత పదేళ్లలో మెట్రో విస్తరణపై ఎలాంటి చర్యలు చేపట్టలేదని, ఒకప్పుడు దేశంలో రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్ మెట్రో ఇప్పుడు తొమ్మిదో స్థానానికి పడిపోయిందని విమర్శించారు. ప్రస్తుతం హైదరాబాద్ కోర్ అర్బన్ ప్రాంత జనాభా 1.34 కోట్లకు చేరుకున్న నేపథ్యంలో మెట్రో విస్తరణ తప్పనిసరిగా మారిందన్నారు. రెండో దశ విస్తరణకు ఎల్ అండ్ టీని ఒప్పించాలని కేంద్రం సూచించినప్పటికీ, ప్రతి ఏడాది రూ.350 నుంచి రూ.400 కోట్ల నష్టాలు వస్తున్నందున విస్తరణ సాధ్యం కాదని సంస్థ స్పష్టం చేసిందన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే మెట్రో మొదటి దశను స్వాధీనం చేసుకుని, విస్తరణ బాధ్యతలను చేపట్టాలని కేంద్రం సూచించిందని వివరించారు. రూ.30 వేల కోట్ల విలువైన ప్రాజెక్టును రూ.15 వేల కోట్లకే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందని పేర్కొన్న సీఎం, మెట్రో స్వాధీనం కోసం కేవలం 4 శాతం వడ్డీకే ఐఆర్ఎఫ్‌సీతో రుణ ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. ఇందుకోసం రూ.84 కోట్ల ఫీజుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.1,400 కోట్ల ఈక్విటీని కూడా ఇప్పటికే చెల్లించిందన్నారు. అన్ని ఒప్పందాలు పూర్తయి, నిధుల విడుదల జరగాల్సిన రోజునే చెల్లింపులు నిలిచిపోవడం వెనుక కారణం ఏమిటని సీఎం ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లో మెట్రో ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం 50 శాతం నిధులు అందిస్తున్నప్పుడు తెలంగాణ విషయంలో వివక్ష ఎందుకని నిలదీశారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి జోక్యం చేసుకుని సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరిన ముఖ్యమంత్రి, హైదరాబాద్ మెట్రో విస్తరణ రాజకీయ అంశం కాదని, ప్రజా ప్రయోజనాల కోసం చేపడుతున్న అభివృ ద్ధి కార్యక్రమమని స్పష్టం చేశారు. “ప్రజలకు మేలు జరగాలి. హైదరాబాద్ భవిష్యత్తు కోసం మెట్రో విస్తరణ అత్యంత కీలకం. ఈ సమస్య సామరస్యపూర్వకంగా పరిష్కారం కావాలని కోరుకుంటున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

 

Where have the Metro funds stalled?