- భారీ వర్షాలకు గుంతలుగా మారిన మోస్రా రోడ్డు
- మరమ్మతులకు నోచుకోని వైనం
మోస్రా, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా మోస్రా మండల కేంద్రం సమీపంలో రోడ్లను చూసిన వారు ఆశ్చర్యపోతారు. అక్కడి ద్రుశ్యాలు ఏ గ్రహం మీద తీసిన ఫోటోలకు ఏ మాత్రం తీసిపోవు. ఎక్కడా సైంటిస్టులు నాసా నుంచి తీసిన ఫోటోల మాదిరిగా రోడ్లు మారాయి. అడుగుకో గుంతగా మారడంతో గతుకుల ప్రయాణం ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. అది సాధారణ రోడ్డు కూడా కాదు. నిజామాబాద్, వర్ని మధ్యలో గల మోస్రాలో రోడ్డు అందాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇటీవల కాలంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు అతలాకుతలం చేసిన విషయం తెల్సిందే. గత కొన్ని సంవత్సరాలుగా వర్ని నుంచి మోస్రా వరకు కొత్త రోడ్లను వేస్తున్న విషయం తెల్సిందే. అవి పూర్తిగా నిర్మాణం కాకముందే కురిసిన భారీ వర్షాలకు రోడ్లు మొత్తం గుంతలమయంగా మారాయి. ఈ నేపథ్యంలో మరమ్మత్తులకు అధికారులు పంపించినా అంచనాలు కాగితాలకే పరిమితమయ్యాయి. నిత్యం వందలకొద్ది బస్సులు, కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలు పరుగులు తీసే రోడ్డు ప్రజలకు నరకాన్ని చూపిస్తుంది. అధికారులు రోడ్ల మరమ్మత్తులకు అంచనాలు వేసి ప్రభుత్వానికి పంపినా జిల్లాలో ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. దాంతో చాలా రోడ్లు గతుకులమయంగానే ఉంది. వర్షాకాలం ముగింపు దశకు వచ్చినా ఇప్పటి వరకు రోడ్లు రిపేర్ కు నోచుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనాలలో ప్రయాణించే వారికి మోస్రా రోడ్డు నరకప్రాయంగా మారింది.
