Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 February 2026, 5:06 pm Posted by : ramakrishna

హామీ నెరవేర్చిన వేళ

 

. . . సొంత మేనిఫెస్టో అమలు

 

. . . 8 వార్డ్ కౌన్సిలర్ కు అభినందన వెల్లువ

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు గెలిచిన తర్వాత తుంగలో తొక్కడం నేటితరం రాజకీయాల్లో చూస్తున్నాం. కానీ ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ముందడుగు వేసి ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ సిద్ది శ్రీధర్ గుప్తా శభాష్ అనిపించుకున్నారు. ఇటీవల జరిగిన ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సిద్ది శ్రీధర్ గుప్తా అఖండ విజయం సాధించారు. ప్రధాన పార్టీ అభ్యర్థులను ఓడించి ఓటర్ల అభిమానాన్ని చురగొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్ది శ్రీధర్ గుప్తా ప్రకటించిన అమ్మాయి వివాహానికి 11,000 రూపాయల హామీని గురువారం అమలు చేశారు. ఎనిమిదో వార్డులో ఉన్న అమ్మాయిలలో ఎవరికైనా వివాహం జరిగితే 11 వేల రూపాయలు అందజేస్తానని మేనిఫెస్టోలో ప్రకటించారు. ఈ మేరకు ఎనిమిదో వార్డులోని ముశెట్టి నాగరాజ్, అనిత దంపతుల కుమార్తె ముశెట్టి హర్షిత వివాహం అజయ్ తో గురువారం ఓ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముశెట్టి హర్షితకు 11వేల రూపాయలతో పాటు చీరే సారతో సిద్ది శ్రీధర్ గుప్తా స్నేహ గుప్తా దంపతులు సత్కరించారు. సిద్ది శ్రీధర్ గుప్తా మేనిఫెస్టోకు ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఘోర పరాజయం పొందారు. ఎనిమిదవ వార్డు ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఆడపిల్ల వివాహానికి 11000, అంతక్రియలకు 10,000, ఆడపిల్ల జన్మిస్తే 11,000, ఆరు నెలలకు ఒకసారి ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేస్తానని సిద్ది శ్రీధర్ గుప్త ప్రకటించారు. అలాగే ఎనిమిదవ వార్డు ప్రజల కోసం బాడీ ఫ్రీజర్ ని సమకూరుస్తానని హామీ ఇచ్చారు. వార్డులో ఎవరైనా ఇల్లు కట్టుకుంటే ఎలాంటి అవినీతికి తావు లేకుండా అనుమతులు ఇప్పిస్తానని వార్డు ప్రజలకు ఇచ్చిన హామీల్లో మరో ముఖ్యమైనది. ఇచ్చిన హామీలు మరిచిపోయే రాజకీయ నాయకులు ఉన్న ఈ సమయంలో హామీలను నెరవేర్చేందుకు నడుంబిగించిన సిద్ది సిధర్ గుప్తాను మిగతా నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు.