- 17న డిచ్ పల్లి డివిజన్ అలాట్మెంట్
- 18న ఓ అండ్ ఎం ఉద్యోగులకు పోస్టింగ్ లు
- పవర్ హౌస్ కాంపౌండ్ లో రివర్సన్లపై నిరసనలు
- మెజారిటీ ఉద్యోగుల హర్షం
- నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లాలో డిచ్ పల్లి డివిజన్ కల సాకారమైంది. తెలంగాణ ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ 2022లో ఇచ్చిన నార్తన్ ఆర్డర్స్ ఈనెల 17న అలాట్ మెంట్ తో 18న ఆపరేషన్ అండ్ మేంటెనెన్స్ స్టాఫ్ ఆర్డర్స్ తో కల సాకారమైంది. నిజామాబాద్ జిల్లాలో వర్క్ డివిజన్ లో భాగంగా డిచ్ పల్లి డివిజన్ కోసం జరుగుతున్న పనుల విషయంలో ‘‘బతుకమ్మ’’ పత్రికలో వచ్చిన కథనాలతో ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటీ వాసు ఉత్తర్వులతో డిచ్ పల్లి డివిజన్ ఏర్పాటు కథ పరి సమాప్తి జరిగింది. నిజామాబాద్ డివిజన్ లో వర్క్ లోడ్ కారణంగా డివిజన్ ఏర్పాటు కోసం ఉద్యోగులతో పాటు స్థానిక ప్రజల డిమాండ్ నెలకొంది. ఈ విషయంలో గత ప్రభుత్వ హయాంలోనే అప్పటి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ డిచ్ పల్లి డివిజన్ ఏర్పాటుకు నాటి ప్రభుత్వానికి, సీఎండీకి విన్నవించారు. ఈ నేపథ్యంలోనే డిచ్ పల్లి డివిజన్ ఏర్పాటుకు ఆనాటి ప్రభుత్వం ఓకే చెప్పింది.
నిజామాబాద్ జిల్లాలో కొత్త విద్యుత్ శాఖ డివిజన్ ఏర్పాటుపై జిల్లాలో విద్యుత్ ఉద్యోగుల్లో కలవరం ఏర్పడింది. అందుకు కారణం ఎక్కడ తమకు దక్కిన పదోన్నతులు వెనక్కి వెళతాయోనని అనుమానాలు వ్యక్తం చేసినట్టే డివిజన్ ఏర్పాటును పక్కన బెట్టి పదోన్నతులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో రెండు యూనియన్ల నాయకులు రివర్సన్ లేకుండా డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ ను ముందుంచారు. దానికి కారణం లేకపోలేదు. ఒకరిద్దరు లీడర్లు డిచ్ పల్లి డివిజన్ కు వెళ్లాల్సి వస్తుందని డివిజన్ ఏర్పాటును సాంకేతిక పరంగా అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. డిచ్ పల్లి డివిజన్ ఏర్పాటు జరిగితే ఆర్మూర్ డివిజన్ నుంచి సిరికొండ, గడ్కోల్, జక్రాన్ పల్లి, పడకల్ సెక్షన్లు విలీనం అవుతాయి. నిజామాబాద్ డివిజన్ లోని కీలకమైన సారంగా పూర్, మోపాల్, నిజామాబాద్ రూరల్, బర్ధిపూర్, డిచ్ పల్లి, ధర్పల్లి, ఇందల్వాయి, ధర్మారం, ఎల్లారెడ్డిపల్లిలు డిచ్ పల్లి డివిజన్ కు కేటాయించారు.
నిజామాబాద్ డివిజన్లో పనిచేస్తున్న నలుగురు సీనియర్ లైన్ ఇన్స్ పెక్టర్లకు డిచ్ పల్లి డివిజన్ ఆప్షన్ లను ఇప్పించారు. దాని వల్ల నలుగురు లైన్ ఇన్స్ పెక్టర్లకు, నలుగురు లైన్ మెన్ లకు, నలుగురు ఏఎల్ఎంలకు రివర్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఒకవేళ వాళ్లు నిజామాబాద్ డివిజన్ కు ఆప్షన్ ఇప్పించి ఉంటే రివర్సన్ కావాల్సిన అవసరం ఉండేది కాదు. కేవలం ఒక్కడి కోసం డివిజన్ ఏర్పాటును మూడు సంవత్సరాలుగా అడ్డుకునే పరిస్థతి ఏర్పడింది. ఒక్కడితో పాటు మిగిలిన ముగ్గురి కారణంగా ఎనిమిది మంది బలి కావాల్సిన పరిస్థతి దాపురించింది.
18 మార్చి 2025న సీఎండీ డివిజన్ ఏర్పాటు కోసం అధికారిక ఉత్తర్వులను జారీ చేశారు. 2023 సమయంలోనే డివిజన్ ఇంజనీర్, ఏడీఈలతో పాటు ఏఈలను, అకౌంట్ సిబ్బందిని కేటాయించారు. వారితో పాటు నాలుగో తరగతి ఉద్యోగులను కూడా కేటాయించారు. ఈ సమయంలోనే ఓ అండ్ ఎం స్టాఫ్ ను కేటాయించకపోవడంతోనే ఉద్యోగుల విభజన ప్రక్రియకు బ్రేక్ పడింది. ఆనాడే ఫీల్డ్ స్టాఫ్ లోని ఉద్యోగులను అలాట్ మెంట్ చేసి ఉంటే పదోన్నతులు ఉండక పోతుండే. దానితో పాటు ప్రస్తుతం జరిగిన రివర్సన్ లేకుండానే విభజన ప్రక్రియ జరిగి ఉండేది. దాని కారణంగానే గత మూడేళ్లు గా డివిజన్ ఏర్పాటును రెండు ప్రధాన యూనియన్లు అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేశాయి. అది చాలదన్నట్టు కోర్టును ఆశ్రయించి డివిజన్ ఏర్పటును అడ్డకునేందుకు ప్రయత్నించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి సీఎండీ, నిజామాబాద్ ఎస్ఈతో మాట్లాడి డిచ్ పల్లి డివిజన్ ఏర్పాటు చేయాలని ఖరాఖండీగా చెప్పడంతో ఉద్యోగుల విభజన ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ఇదిలా ఉండగా ఈనెల 17న డిచ్ పల్లి డివిజన్ ఏర్పాటుకు ఉద్యోగుల అలాట్ మెంట్, 18న పోస్టింగ్ ఆర్డర్ లు ఇవ్వడంతో పవర్ హౌస్ కాంపౌండ్ లో 1104, తెలంగాణ విద్యుత్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రివర్సన్ లేకుండా విభజన ప్రక్రియ చేయాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. అయితే డిచ్ పల్లి డివిజన్ ఏర్పాటుతో మెజారిటీ విద్యుత్ ఉద్యోగులు హర్ష వ్యక్తం చేస్తూ సంబంరాలు చేసుకుంటున్నారు.
