రైతాంగానికి సాగు నీరు ఇవ్వాలి
శాసనసభలో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి
వెబ్ న్యూస్, బతుకమ్మ : బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించిన ఇరిగేషన్ సమస్యలను శాసనసభలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి లేవనెత్తారు. ప్యాకేజ్ 21 ఏ పనులను వేగంగా పూర్తి చేసి రైతులకు సాగునీరు ఇవ్వాలన్నారు. బాల్కొండ,నిజామాబాద్ రూరల్,ఆర్మూర్,మెటపల్లి నియోజకవర్గాల్లో సుమారు 2,12,000 ఎకరాలకు సాగు నీరు ఇవ్వడానికి నిర్దేశించిన ప్రాజెక్ట్ ప్యాకేజ్ 20,21,21 ఏ రూ. 4800 కోట్లతో మొదలు పెట్టి గత ప్రభుత్వ హయాంలోనే 70 శాతం పనులు పూర్తి చేసి సుమారు రూ. 3300 కోట్లు ఖర్చు చేశామన్నారు. మిగతా పనులు కూడా తొందరగా పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా ప్యాకేజ్ 21 ఏ మెట్పల్లి సెగ్మెంట్ లో బాల్కొండ నియోజవర్గంలో భీంగల్,వేల్పూర్, కమ్మర్పల్లి,మోర్తాడ్ మండలాలకు కలిపి 80 వేల ఎకరాలు, నిజామాబాద్ రూరల్ జక్రాన్ పల్లి మండలంలో 28000 ఎకరాలు, ఆర్మూర్ నియోజకవర్గంలో 6000 ఎకరాలు మరియు మెట్ పల్లి నియోజకవర్గంలో 12000 ఎకరాలకు సాగు నీరు అందించవచ్చన్నారు. ప్యాకేజ్ 21 ఏ మెటపల్లి సెగ్మెంట్ లో దాదాపు 80 శాతం పనులు పూర్తి అయ్యాన్నారు. హెడ్ వర్క్స్,పంప్ హౌజ్ లు,మెయిన్ డిస్ట్రిబ్యూటరీ లైన్ ,మెయిన్ లైన్ పూర్తి కాగా, ఒక డిస్ట్రిబ్యూటరి లైన్ వేయాల్సి ఉందన్నారు. ప్యాకేజ్ 21 ఏ మిగతా 20 శాతం పనులు 6 నెలల్లోనే పూర్తి చేస్తే 1,20,000 ఎకరాలకు సాగు నీరు అందించవచ్చన్నారు. ఈపనులు వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే కోరారు. 9274 ఎకరాలకు సాగు నీరు అందించే చిట్టాపూర్,సుర్బిర్యాల్,ఫత్తేపూర్ లిఫ్ట్ పనులు వేగవంతం చేయాలన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఫతేపూర్,సుర్బియాల్ గ్రామాలకు రూ.90 కోట్లతో 5800 ఎకరాలకు ఈ లిఫ్ట్ ద్వారా సాగు నీరు అందించవచ్చన్నారు. పనులు నెమ్మదిగా సాగుతున్నాయని, వేగవంతం చేసి లిఫ్ట్ ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోరారు.